Munugode exit poll : మునుగోడు మహా యుద్ధం ముగిసింది. రెండు నెలల హోరాహోరీ రాజకీయ పోరాటానికి తెరపడింది. ఓటరు తీర్పు ఈవీఎం లలో నిక్షిప్తమైంది. మునుగోడులో ఆధిక్యం ఎవరికి దక్కేది ఈ నెల 6న తేలిపోనుంది.
మునుగోడు సామాన్యుడు ఎవరి వైపు నిలిచాడు? ఉత్కంఠ రేపిన పోరులో విజయం ఎవరిని వరించనుంది? ఏయే అంశాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి? ఎవరి మాటను ఓటర్లు విశ్వసించారు? వీటికి సమాధానం వెతికే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. గరుడ సర్వే ఏజెన్సీతో కలిసి.. అత్యంత శాస్త్రీయమైన సర్వే నిర్వహించింది. మునుగోడులో తిష్ట వేసిన సమస్యల దగ్గరి నుంచి.. అభ్యర్థుల బలాబలాలు, పార్టీలపై ప్రజల్లో అభిప్రాయాలు, ఓటర్ల ఆకాంక్షలు, సామాజికవర్గాల సమీకరణాలు… ఇలా అనేక అంశాల్లో నిఖార్సైన సర్వే నిర్వహించి… ఎగ్జిట్ పోల్ అంచనాలను రూపొందించింది. ఆ సర్వేలో సంచలన ఫలితాలు వెల్లడయ్యాయి.
బిగ్ టీవీ + గరుడ ఎగ్జిట్ పోల్ లో.. ఈ సారి మునుగోడులో గులాబీ దళానికి కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది. బీజేపీతో పోటాపోటీ సమరం నడిచినా.. చివరికి కారు జోరు ముందు కమలం నిలవలేకపోయిందని వెల్లడైంది.
మునుగోడు హోరాహోరీ పోరులో టీఆర్ఎస్ పార్టీదే అప్పర్ హ్యాండ్ గా కనిపిస్తోంది. సర్వేలో.. 47.1 శాతం మంది గులాబీ పార్టీని సమర్థించగా.. 32.4 శాతం మంది బీజేపీ పార్టీగా మద్దతుగా.. 12.1 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిలిచారు. ఇతర అభ్యర్థులకు 8.4 శాతం మంది మద్దతు లభించినట్టు తెలుస్తోంది.
బిగ్ టీవీ, గరుడ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 2 శాతంగా ఉంది. శాతాలు కొంచెం అటూ ఇటూగా వచ్చినా… ఫలితం మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది.