Big Stories

BJP BRS Conspiracy | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర?.. బీఆర్ఎస్, బిజేపీ ప్రయత్నాలు!

BJP BRS Conspiracy | తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్, బిజేపీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

మరో ఆరు నెలల్లోగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఇటీవల వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరిలపై పీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ నేత, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చారుకొండ వెంకటేష్, మధుసూదన్‌లు మంగళారం డీజీపీకి ఫిర్యాదు చేశారు.

- Advertisement -

తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని డీజీపీకి చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వాఖ్యలు ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు డీజీపీ రవి గుప్తాకు వినతిపత్రం అందజేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 గంటలు కూడా గడవక ముందే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి మాట్లాడుతూ.. “మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూద్దాం.. ఆరు నెలలా.. లేక ఒక సంవత్సరమా.. అసలు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ లేదు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం,” అని చెప్పారు.

ఆ తరువాత మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “వచ్చే ఏడాది బిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది.. దీనికి కచ్చితంగా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కాంగ్రెస్ నాయకులు వారికి వారే ప్రభుత్వం కూల్చేసుకుంటారు,” అని వ్యాఖ్యలు చేశారు.

వీరికి తోడు బిజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆయన ఇటీవల మీడియా ముందు మాట్లాడుతూ.. ” తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఆ తరువాత బిజేపీ సర్కార్ ఉంటుంది,” అని అన్నారు.

బిజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. తుమ్మినా.. దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కిషన్ రెడ్డి చాలా చులకనగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే పరోక్షం అర్థం ఒక్కటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బిజేపీ, బిఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నారని. మరి గొప్ప గొప్ప సైద్ధాంతిక విలువలున్న బిజేపీ, లేదా బిఆర్ఎస్ పార్టీలు ఇలా చెప్పడం.. లేదా చేయడం నైతికంగా ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి ఆలోచించుకోవాలి.

ఇలాంటి పార్టీలకు తెలంగాణ ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. కర్ణాటక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జెడిఎస్ కూటమి ఏర్పాటు చేస్తే.. అక్కడ యెడ్యురప్ప నేతృత్వంలోని బిజేపీ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేసింది. అలాగే కేసీఆర్ కూడా అంతకుముందు 2014 ఎన్నికల్లో కేవలం 63 సీట్లతో తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి ఎన్నికలు గెలిచారు. కానీ కొన్ని నెలల సమయంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేసి హస్తం పార్టీని బలహీనం చేసేందుకు ప్రయత్నించారు.

ఈ రెండు సంఘటనలకు సంబంధించి ప్రజలు ఆయా పార్టీలకు గట్టి సమాధానం చెప్పారు. 2023 కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయం కానుకగా ఇచ్చారు. ఈ రెండు హర్షించదగిన పరిణామాలే. ఎందుకంటే కుట్రలు చేసి ప్రభుత్వాలు కూల్చేసే పార్టీలకు ప్రజలు తమ ఓటు హక్కుతో సమాధానమిస్తారని రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలే ఉదాహరణ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News