
kondareddypalli : రెండ్రోజుల పాటు ఉత్కంఠ రేపిన తెలంగాణ సీఎం సీటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని వరించడంతో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఊరూరా బాణాసంచా కాల్చి కేరింతలు కొట్టారు. రేవంత్ స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోనూ సంబరాలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ సందడి చేశారు. దీంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటి నుంచి మాది సీఎం ఊరు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సీఎం కావడం.. అది తమ గ్రామస్తువడం గర్వంగా ఉందన్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్‌ను సీఎంగా ప్రకటించడంతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంతోపాటు తన సొంత గ్రామంలోనూ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ విజయం ఖాయమని ఆదివారం మధ్యాహ్నాని తేలిపోవడంతో కాబోయే సీఎం ఎవరన్న చర్చ జోరుగా సాగింది. పార్టీ సీనియర్ నేతలైన భట్టి, ఉత్తమ్ వంటి వారు రేసులో నిలవడంతో అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. రెండ్రోజులపాటు సుదీర్ఘ చర్చల తర్వాత ఎట్టకేలకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని అధికారిక ప్రకటన చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనునుండటంతో.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లకు సంబంధించి సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలతోపాటు భారీగా కార్యకర్తలు హాజరుకానున్నారు.