తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు మొదలైంది. ఊరా వాడా పల్లె పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఓట్ల పండగతో తెలంగ్రామీణం ఊగిపోతుంది. పులిలా పంజా విసురుతున్న చలిలోనూ.. అభ్యర్థులు చేస్తున్న వాగ్ధానాలు పొలికల్ హీట్‌ను పెంచుతున్నాయి. తాజాగా ‘తనను సర్పంచిగా ఏకగ్రీవం చేస్తే’ అంటూ ఒక అభ్యర్థి చేసిన వాగ్దానం సంచలనంగా మారింది. అభ్యర్థి ప్రకటన చూసిన గ్రామస్తులు అవాక్కయ్యారు. ఇంతకీ ఎవరా అభ్యర్థి, ఆయన చేసిన వాగ్ధానం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోలాహాలం మొదలైంది. నిన్న మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్స్‌తో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉండేది. కోర్టు తీర్పు తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. అయితే జూబ్లీహిల్స్ గెలుపు ఊపులో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా తమ సత్తా చాటాలని చూస్తుంది. బీసీ సంఘాల నుంచి నిరసనలు ఎదురైనా ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది. దీంతో రాష్ట్రంలో తాజాగా సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్, రావడం అలాగే నోటిఫికేషన్ రావడంతో తెలంగ్రామీణంలో ఎన్నికల కోలాహాలం మొదలైంది.
ఎన్నికల షెడ్యూల్ రావడంతోనే సర్పంచ్ ఆశావహులంతా గ్రామాల్లో తిష్ట వేశారు. మొదటి దశ ఎన్నికల నామినేషన్ స్వీకరణ నవంబర్ 27-29 వరకు జరిగింది. నుంచి మొదలయింది. నామినేషన్ల ఉపసంహరణ ఇవాళ్టీతో ( డిసెంబర్ 3) ముగియనుంది. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరగనుంది. అలాగే రెండో విడత పోలింగ్ కోసం నామినేషన్ల స్వీకరణ నవంబర్ 30న మొదలై డిసెంబర్ 2న ముగింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 6 వరకు ఉంది. రెండో విడత పోలింగ్ డిసెంబర్ 14న జరగనుంది. అలాగే చివరిదైన మూడో విడత పోలింగ్‌కు నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 9 వరకు ఉండనుంది. అలాగే చివరి విడత పోలింగ్ ఈనెడ 17న జరగనుంది.
అయితే సర్పంచ్‌గా గెలవాలని కొంత మంది అభ్యర్తులు ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక రెండో విడతలో కొంత మంది అభ్యర్థులు తమను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్దికి కృషి చేస్తామని చెప్తున్నారు. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన మల్లేపల్లి లక్ష్మా రెడ్డి అనే సర్పంచ్ అభ్యర్థి ఒక్క అడుగు ముందుకేసి తనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ది కోసం ఏకంగా రూ. 30 లక్షలు డోనేషన్‌గా ఇస్తానని అలాగే గ్రామ పంచాయతీ అవసరాల కోసం ఒక ట్రాక్టర్ ను కూడా గిఫ్టుగా ఇస్తానని ప్రకటించారు. ఆయన ప్రకటనతో గ్రామస్తులు అవాక్కయ్యారు. గ్రామ పంచాయతీ చరిత్రలో ఇలాంటి వాగ్థానం చేసిన వ్యక్తులు లేరని ఇలాంటి ఆఫర్ ఇచ్చిన మొదటి వ్యక్తి అయనే అంటూ చెప్తున్నారు. అయితే లక్ష్మారెడ్డి మాత్రం గ్రామ అభివృద్ది కమిటీ మరియు గ్రామ ప్రజల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ఊరి ప్రజలంతా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.
అయితే ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బలవంతంపు ఏకగ్రీవాలు అంగీకరించేది లేదని అటువంటివి తమ దృష్టికి వస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.