Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీసీ ఓటు బ్యాంకే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ(BJP) సరికొత్త వ్యూహానికి పదును పెట్టింది. బీసీ గళంతో బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. 42 శాతం రిజర్వేషన్లే అస్త్రంగా కమలదళం మున్సిపల్ పోరులో దిగనుంది. దీంతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారనుంది. రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల(బీసీ) ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల ప్రచార అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ఆ అంశాన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకోవాలని పార్టీ నిర్ణయించింది.
బీసీలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీజేపీ ఒక ప్రత్యేక కరపత్రాన్ని రూపొందించింది. ఈ కరపత్రంతో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి, ప్రతి బీసీ కుటుంబానికి కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. మున్సిపాలిటీలకు కేంద్రం ఇచ్చే నిధులతో పాటు, కాంగ్రెస్ రెండేళ్ల పాలన వైఫల్యాలపై బీజేపీ కరపత్రం ఉండనుంది. కాంగ్రెస్ పాలనలో మార్పు రాలేదని, తెలంగాణ(Telangana) బతుకులు మారలేదన్న నినాదంతో ఇంటింటికీ కరపత్ర ప్రచారం నిర్వహించనుంది. బీసీ ఓటు బ్యాంకు తమ వైపు ఉంటే విజయం సునాయాసమని కమలం పార్టీ బలంగా నమ్ముతోంది. ఇదిలా ఉండగా ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు అధికంగా ఉన్న వార్డులపై ప్రత్యేక దృష్టి సారించింది.
Also Read: Lord Hanuman: మీ కుటుంబంపై హనుమంతుని రక్షణ ఉందా ? ఈ 9 సంకేతాలతో తెలుసుకోండి !
మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా ఇన్ చార్జీలు, మున్సిపాలిటీ ఇన్ చార్జీలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ప్రచార వ్యూహాలపై లోతుగా చర్చించి అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరంఅభ్యర్థులకు పార్టీ అధికారికంగా బీ-ఫారాలను అందజేయనుంది. మున్సిపల్ ఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కాగా ఇక రాష్ట్రంలో నిర్వహించే రెండు భారీ బహిరంగ సభలతో ప్రచారంలో దూసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల 2న మహబూబ్ నగర్, 7 న నిర్మల్‌లో భారీ బహిరంగ సభలను కాషాయ పార్టీ నిర్వహించనుంది. 2న జరిగే మహాసభకు జాతీయ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా(Nitin Nabin Sinha), 7న నిర్మల్‌లో జరిగే సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) హాజరవ్వనున్నారు. అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకునే దిశగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో బీసీలకు అసలైన అండ తామేనని నిరూపించుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. అయితే బీసీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: SBI Careers: నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. ఎస్బీఐలో 2,273 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.85,590