
Telangana Elections : కాంగ్రెస్ కి అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. రెబల్స్ బెడద కూడా లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి సక్సెస్ కాగలిగింది. తమకు టికెట్లు రాలేదని పలువురు నేతలు రెబల్ గా నామినేషన్లు వేశారు. ముఖ్య నేతలు రంగంలోకి దిగి దారికి తెచ్చారు. సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ వెనక్కి తీసుకోగా.. జుక్కల్‌లో గంగారాం.. బాన్సువాడలో బాలరాజు పోటీ నుంచి తప్పుకున్నారు. డోర్నకల్‌లో నెహ్రూ నాయక్.. వరంగల్ వెస్ట్‌లో జంగా రాఘవరెడ్డి నామినేషన్ విత్ డ్రా చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థికి జై కొట్టారు.
ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతున్నాయి.రోజురోజుకు కొండంత బలం పెరుగుతోంది. ఇన్ని రోజులు రెబల్స్ గుబులు ఉండగా.. వాళ్లు కూడా మెత్తబడ్డారు. అధిష్టానం ఆదేశాలతో రెబల్స్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఎన్నికల బరి నుంచి పలువురు కాంగ్రెస్ రెబల్ నేతలు తప్పుకున్నారు. సూర్యాపేట టికెట్ తనకి దక్కలేదంటూ ఆగ్రహంతో నామినేషన్ వేసిన పటేల్ రమేష్‌రెడ్డి శాంతించారు. ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ వేయగా ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్ లురవి, రోహిత్ చౌదరి బుజ్జగింపుతో పటేల్ రమేష్‌రెడ్డి మెత్తబడ్డారు. కేసీ వేణుగోపాల్, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌తో చర్చించి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఆయన ఓకే చెప్పారు. ఫలితంగా సూర్యాపేట అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది.
జుక్కల్‌లో నామినేషన్ దాఖలు చేసిన గంగారం కూడా శాంతించారు. బాన్సువాడలో బాలరాజు, డోర్నకల్‌లో నెహ్రూ నాయక్ పోటీ నుంచి తప్పుకున్నారు. వరంగల్ వెస్ట్‌లో టికెట్ ఆశించిన జంగా రాఘవరెడ్డి కూడా అధిష్టానం హామీ మేరకు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. బాన్సువాడలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కూడా దారికొచ్చారు. కాసుల బాలరాజు, అంబర్ సింగ్ నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. జుక్కల్‌లో టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే గంగారాం, ఆర్మూర్‌లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రాజేందర్ పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
వైరా నియోజకవర్గంలో రెబల్‌గా నామినేషన్ వేసిన ధరావత్ రామ్మూర్తి నాయక్, బట్ట విజయ్ గాంధీ ఉపసంహరించుకున్నారు. ఎల్బీనగర్ స్వతంత్ర అభ్యర్థి కొమురెళ్లి రాజిరెడ్డి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. మధు యాష్కీకి మద్దతుగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొమురెళ్లి రాజిరెడ్డి.. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ లభించగా పోటీ నుంచి తప్పుకున్నారు. జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నానని ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీస్తుండగా రెబల్‌గా నామినేషన్ వేసిన అభ్యర్థులు కూడా వెనక్కి తగ్గారు. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేననే భరోసాతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించినట్లైంది. రెబెల్స్ హస్తం పార్టీ విజయావకాశాలను గండికొడతారనే ప్రత్యర్థి పార్టీల అంచనాలు పటాపంచలయ్యాయి. కర్ణాటక తరహాలోనే నేతలంతా ఐక్యత కొనసాగిస్తుండగా విజయం నల్లేరుపై నడకే కానుందని హస్తం శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అందుకే రెబల్ అభ్యర్థులు కూడా పోటీ వెనక్కి తగ్గారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు కీలక పదవులు దక్కుతాయనే నమ్మకంతో పోటీ తప్పుకున్నారు.