
National Press Day : నవంబర్ 16న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మోరల్ వాచ్ డాగ్ గా పనిచేయడం ప్రారంభించింది. పత్రికలు.. జర్నలిజం ప్రమాణాలను పాటించేలా, శక్తిమంతుల ప్రభావానికి లోకాకుండా చూసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మొదటి ప్రెస్ కమిషన్ సూచనల మేరకు 1956 లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. జర్నలిజంలో వృత్తిపరమైన ప్రమాణాలను కొనసాగించడానికి ప్రెస్ కౌన్సిల్ దోహదపడుతుంది.
ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడే పత్రికలు ప్రజాభిప్రాయాన్ని చెప్పడంలో, సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో.. అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ సూత్రాలను నిలబెట్టడానికి.. ఈ జాతీయ పత్రికా దినోత్సవం స్ఫూర్తిగా నిలుస్తుంది.
భారత మీడియా ల్యాండ్ స్కేప్ కొన్నేళ్లుగా సవాళ్లను ఎదుర్కొంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తన స్థితిస్థాపకతను ప్రదర్శిస్తూ గణనీయంగా అభివృద్ధి చెందింది. ప్రింట్ జర్నలిజం యుగం నుంచి డిజిటల్ యుగం వరకు పత్రికలు నిరంతరం కొత్త సాంకేతికతలను అనుగుణంగా మార్చుకొని సమాచారం దేశంలోని ప్రతి మూలకు చేరేలా చేస్తున్నాయి.
ఏదేమైనా జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకోవడం వల్ల విధి నిర్వహణలో పాత్రికేయులు ఎదుర్కొనే సవాళ్లు తెలుస్తాయి. సెన్సార్ షిప్, పత్రికా స్వేచ్ఛపై దాడులు, పాత్రికేయుల భద్రతకు ముప్పు, ఫేక్ న్యూస్, నైతిక రిపోర్టింగ్ ఆవశ్యకత వంటి అంశాలు చర్చల్లో కేంద్ర బిందువుగా నిలుస్తాయి.
ఇటీవలి కాలంలో, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాటఫార్మ్‌ల రాకతో, సమాచార వ్యాప్తి క్షణాల్లో జరుగుతోంది. తప్పుడు సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి ఆందోళనలను పెంచుతోంది. అందువల్ల సమకాలీన మీడియా ల్యాండ్ స్కేప్‌లో మీడియా అక్షరాస్యత, బాధ్యతాయుతమైన జర్నలిజంను ప్రోత్సహించడం చాలా ముఖ్యం.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ప్రకారం “ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రెస్ , మీడియా కౌన్సిల్లు ఉన్నప్పటికీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన సంస్థ- ఎందుకంటే పత్రికా స్వేచ్చను పరిరక్షించే విధిలో ప్రభుత్వ ఎజెన్సీలపై కూడా అధికారాన్ని ఉపయోగించే ఏకైక సంస్థ ఇది.” అందువల్ల దేశంలో విశ్వసనీయమైన, స్వేచ్ఛాయుతమైన పత్రికా వ్యవస్థను కలిగి ఉంది.
ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన విలువలను తెలియజేసేందుకు పలు సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగే జాతీయ పత్రికా దినోత్సవానికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక సూత్రాలను పరిరక్షించడానికి, పాత్రికేయుల భద్రతను కాపాడటానికి ఖచ్చితమైన నిష్పాక్షిక సమాచారాన్ని పొందే ప్రజల హక్కును కాపాడటానికి జాతీయ పత్రికా దినోత్సవం స్ఫూర్తిగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అవసరమైన స్వేచ్ఛాయుత, చైతన్యవంతమైన పత్రికా విలువలను నిలబెట్టడానికి ప్రభుత్వం, మీడియా సంస్థలు, పౌరులు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చింది.
నేషనల్ ప్రెస్ డే 2023 థీమ్ “మీడియా ఇన్ ది ఎరా ఆఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్”.