DGP Jitender: హీరో అల్లు అర్జున్ కేసుపై మరోమారు తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణ పోలీస్ వార్షిక సమావేశంలో అల్లు అర్జున్ కేసు గురించి డీజీపీ మాట్లాడారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న డీజీపీ కీలక కామెంట్స్ చేశారు.
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ పోలీస్ వార్షిక సమావేశాన్ని నిర్వహించిన డీజీపీ మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.87 శాతం కేసులు పెరిగాయన్నారు. ఈ ఏడాది 2,34,158 కేసులు నమోదు చేసినట్లు, ఒకటి రెండు ఘటనలు మినహా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది 85 మంది ని నక్సల్స్ ని అరెస్ట్ చేసినట్లు, 41 మందిని సరెండర్ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు నమోదు కాగా, ఈ కేసులలో 4682 మందిని అరెస్ట్ చేసినట్లు, అలాగే 142.95 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ నేరాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
మొత్తం 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, రూ. 180 కోట్ల వరకు సైబర్ క్రైమ్ లో రీఫండ్ జరిగిందని డీజీపీ తెలిపారు. అలాగే రూ. 247 కోట్లు ఫ్రీజ్ చేశామన్నారు. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత 85,190 కేసులు నమోదు చేశామని, జీరో FIR కింద 1313 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 547 మంది ఎస్సై లు, 12,338 మంది కానిస్టేబుళ్ల నియామకం ప్రభుత్వం చేపట్టిందన్నారు. డయల్ 100 ద్వారా 16,92,173 కాల్స్ వచ్చినట్లు డీజీపీ తెలిపారు. అంతేకాకుండా 38,231 మొబైల్స్ రికవరీ చేసినట్లు, గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది శిక్ష ఖరారు శాతం తగ్గిందన్నారు డీజీపీ.
గత ఏడాది 39,371 కన్విక్షన్ పడగా, ఈ ఏడాది 28,477 మంది మాత్రమే శిక్ష ఖరారైందన్నారు. ముగ్గురికి మరణ శిక్షను న్యాయస్థానం విధించిందని, హైదరాబాద్ లో ఇద్దరు, సంగారెడ్డి ఒక కేసులో ఒకరికి మరణ శిక్ష పడిందన్నారు. అలాగే 18 కేసుల్లో 35 మంది రౌడీ షీటర్లు కు జీవిత ఖైదీ విధించారని, అత్యాచారం కేసులో మూడు కేసుల్లో నలుగురికి జీవిత ఖైదీ విధించారని డీజీపీ అన్నారు.
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన డీజీపీ మాట్లాడుతూ.. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు సాగిస్తున్నట్లు, నిందితులందరిపై కేసులు నమోదు చేశామన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. పోలీసుల సూసైడ్ పై డీజీపీ మాట్లాడుతూ.. పోలీసులు పర్సనల్, ఫ్యామిలీ ఇష్యూతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు, వర్క్ ఇష్యూ ఉందో లేదో తనకు తెలియదన్నారు. చాలా చోట్ల వ్యక్తిగత కారణలతోనే సూసైడ్ చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.