Nizamabad Encounter: ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ను ఆశ్రయించారు. రియాజ్ మృతిని సుమోటోగా స్వీకరించి.. ఈ ఘటనపై సీబీఐతో పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరుతూ వారు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. అందుకే నిష్పాక్షికమైన కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించడమే న్యాయమని కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు.
పోలీసుల అత్యుత్సాహం వల్లే..
రియాజ్ కుటుంబ సభ్యులు ఈ ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండించారు. ఇది కస్టోడియల్ ఎన్‌కౌంటర్ అని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే రియాజ్ మరణించాడని ఆరోపించారు. మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్, రియాజ్ ఎన్‌కౌంటర్‌పై తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని వారు కమిషన్ కు తెలియజేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో దాగుందని, దీని వెనుక ఉన్న నిజాలను సీబీఐ విచారణ ద్వారా మాత్రమే బయటకు తీసుకురాగలమని వారు దృఢంగా నమ్ముతున్నారు.
కన్నీరు పెట్టుకున్న రియాజ్ కుటుంబ సభ్యులు
రియాజ్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపించి.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కన్నీటిపర్యంతమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఇలాంటి బూటకపు ఎన్‌కౌంటర్లు జరగకూడదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసుల చర్యల వల్ల తమ కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని.. రియాజ్ కుటుంబాన్నిబాధితులుగా పరిగణించాలని వారు డిమాండ్ చేశారు.
రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి..
విక్టిమ్ ప్రొటెక్షన్ ఆక్ట్ (Victim Protection Act) ప్రకారం తమకు ఐదు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు ఎన్‌హెచ్‌ఆర్‌సీని అభ్యర్థించారు. పోలీసుల వేధింపులు, ఎన్‌కౌంటర్ వంటి ఘటనల వల్ల మానసికంగా.. ఆర్థికంగా చితికిపోయిన తమకు ఈ పరిహారం న్యాయమని వారు కోరారు. తమ డిమాండ్లను పరిశీలించి, వెంటనే న్యాయ విచారణకు ఆదేశించాలని వారు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు.
ALSO READ: Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి