Jubilee Hills By Elections: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై రాష్ట్ర మంత్రి దాసరి సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావు హడావుడి చూస్తే బీఆర్ఎస్ ఓటమి కాయంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మాగంటి తల్లి ఆవేదన చూస్తే కేటీఆర్ ఎంత పార్టీ మోసకారో అర్థమవుతుందని, సొంత చెల్లి, మాగంటి తల్లి మాటల్లో కేటీఆర్ మోసం బయటపడిందన్నారు. 91 ఏండ్ల వృద్ధురాలు అని చూడకుండా మాగంటి తల్లిని అవమానించారని, మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మహిళలు కేటీఆర్ తీరును గమనించాలని మంత్రి సూచించారు. హరీష్ రావు నిశ్శబ్ద విప్లవం అని ప్రగల్పాలు పలుకుతున్నారని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం అన్నారని గుర్తు చేశారు. ‘‘అ నిశ్శబ్ద విప్లవం మిమ్మల్ని నిండా ముంచింది. నిన్నటి వరకు విషాదంలో ఉన్న హరీష్ రావు ఈరోజు హడావుడిగా బయటకు వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ఓటమి భయంతోనే 24 గంటలు గడవకముందే హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. ఓటమి తప్పదని తెలిసి అవావాలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో మీరు విధ్వంసం చేశారు. వైను, మైను, ల్యాండ్, సాండ్ అన్ని మాఫియాలతో తెలంగాణలో విధ్వంస పాలన చేశారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. ’’ అని మంత్రి విమర్శలు చేశారు.
READ ALSO: Jubilee Hills: మాగంటి డెత్ మిస్టరీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?
తెలంగాణ ప్రజల సమస్యలను రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ఇందిర ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ‘పదేళ్లు కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వని దుష్ట పాలన కెసిఆర్ ది అని విమర్శించారు. మీరు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే…ఆ కబ్జాల నుంచి మేము ఆ భూములను విడిపిస్తున్నామని అన్నారు.
హైదరాబాద్ నిండా ముంచింది బీఆర్ఎస్ అని మంత్రి సీతక్క ఆరోపించారు. గత పదేళ్ల పాలనలో హైదరాబాదులో కనీస మౌలిక వసతులు కల్పించలేదని, కేటీఆర్ ఫ్రస్టేషన్లో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని అడిగితే కేటీఆర్ హరీష్ రావు బండారం తెలుస్తుందన్న మంత్రి, మానవ బంధాలు అనుబంధాలు లేని వ్యక్తులు కేటీఆర్, కేసీఆర్ లు అని దుయ్యబట్టారు.
‘‘ఏ ఒక్క ఆడ కూతురు బీఆర్ఎస్ కి ఓటు వేయదు. మహిళా సంఘాల 3 వేల కోట్లు వడ్డీలు ఎగ్గొట్టిన వాళ్లకు మహిళలు ఓటెయ్యరు. మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం మొదలుకొని.. కోట్ల రూపాయల వ్యాపారాలు మహిళలు చేపట్టేలా చేయూతనందిస్తున్నాం. దాన్ని ఓర్చుకోలేక మహిళలను రికార్డు డాన్స్లు చేసుకోండి అని అన్న కేటీఆర్ మాటలను ఆడకూతురులు మర్చిపోలేదు. డబ్బుయావే తప్ప మానవ సంబంధాలు లేని మనిషి కేటీఆర్. సొంత చెల్లిని, మాగంటి తల్లిని మోసం చేసిన కేటీఆర్ కు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం’’ అని సీతక్క అన్నారు.