PM Modi Akkineni Nageswara Rao | భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగు లెజెండరీ దివంగత నటుడు నటసామ్రాడ్ అక్కినేని నాగేశ్వర రావు (ఎఎన్ఆర్) పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు చేర్చిన నటుడిగా ఎఎన్ఆర్‌ని కీర్తించారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, కుటుంబ విలువలను చక్కగా చూపించబడ్డాయని పొగిడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఎఎన్ఆర్ సినిమాలను గుర్తుకు చేసుకున్నారు.
ప్రధాని మోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం 117వ ఎపిసోడ్ లో భారతీయ సినిమా జగత్తులో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న లెజండరీ నటుల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా 2024లో రాజ్ కపూర్ , అక్కినేని నాగేశ్వర రావు, మహా గాయకుడు మొహమ్మద్ రఫీ, తపన్ సిన్హా లాంటి లెజెండ్ కళాకారులకు నివాళులర్పించారు. వీరి కళకు ప్రపంచవ్యాప్తంగా సాటి లేదని చెప్పారు. భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయడంతో వీరంతా ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు.
వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమా లెజెండ్స్ కు నివాళులర్పించిన ప్రధాని మోదీ
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “భారతదేశం సౌమ్య వాదం, దాని శక్తిని రాజ్ కపూర్ ప్రపంచానికి తెలియజేశారు. రఫీ సాహబ్ తన అద్భుత గాత్రంలో ప్రతి మనసుని గెలుచుకున్నారు. అవి భక్తి గీతాలైనా, రోమాంటిక్ పాటలైనా, సాడ్ సాంగ్స్ అయినా.. ఆయన స్వరంలో ప్రతి భావోద్వేగం అద్భుతంగా పలుకుతుంది. రఫీ పాటల గొప్పదనం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ రోజు యువత కూడా ఆయన పాటలు అదే ప్యాషన్ తో వింటోంది. టైమ్ లెస్ ఆర్ట్ కు గుర్తింపు అంటే ఇదే. అలాగే తెలుగు సినిమాలను కొత్త శిఖరాలను చేర్చిన ఘనత అక్కినేని నాగేశ్వరరావు గారికి దక్కుతుంది. ఆయన భారత సంప్రదాయాలకు ప్రధాన్యమున్న సినిమాలు చేశారు. తపన్ సిన్హా కూడా సామాజిక స్పృహ, జాతీయ సమైక్యతా ను ప్రధానంశంగా సినిమాలు తీశారు. సమాజానికి ఒక్క కొత్త కోణంలో చూపించారు. ఈ మహానుభావులందరూ మన యావత్ సినీ ఇండస్ట్రీకి ఆదర్శప్రాయం” అని ఆయన చెప్పారు.
Also Read: 2024లో భారత్ కోల్పోయిన మహానుభావులు వీరే..
భారతదేశంలో తొలిసారిగా ప్రపంచ స్థాయి వేవ్స్ సమ్మిట్
భారత దేశంలో మొట్టమొదటి సారిగా వరల్డ్ ఆడియా విజువల్ ఎంటర్ టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) సమావేశాలు జరుగునున్నాయని ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని అన్నారు. “2025లో మేము (భారత ప్రభుత్వం) దేశంలోనే మొట్టమొదటి సారిగా వేవ్స్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. మీరు డావోస్ గురించి వినే ఉంటారు. ఆ సమావేశాల్లో ప్రపంచంలోని ఆర్థిక వేత్తలు సమావేశమవుతారు. అలాగే వేవ్స్ సమావేశాల్లో ప్రపంచంలోని మీడియా, సినిమా ఇండస్ట్రీకి చెందిన టెక్నీషియన్స్, కళాకారులు సమావేశం కాబోతున్నారు. భారత దేశం గ్లోబల్ కంటెంట్ క్రియేషన్ హబ్ గా మారబోతుందనేందుకు ఇది తొలి అడుగు కాబోతోంది. మన దేశ కంటెంట్ క్రియేటర్లు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట్లు నేను గర్వంగా చెబుతున్నాను.
మన దేశం 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో కంటెంట్ క్రియేటర్లు కొత్త ఎనర్జీని తీసుకువస్తారని నేను భావిస్తున్నాను. దేశంలోని కొత్త కంటెంట్ క్రియేటర్లైనా, ఇప్పటికే పేరుగాంచిన కళాకారులైనా, బాలివుడ్ అయినా, ప్రాంతీయ సినిమా అయినా, టివి ఇండస్ట్రీ అయినా, యానిమేషన్ , గేమింగ్ ఇండస్ట్రీ ఏదైనా సరే అందరూ వేవ్స్ సమావేశాలకు రావాలని ఆహ్వానం పలుకుతున్నాను” అని మోదీ సినీ ఇండస్ట్రీకి ఒక శుభవార్త చెప్పారు.