పహల్గాం ఉగ్రదాడిపై MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందన ఏంటి అనే ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ విషయంలో అసదుద్దీన్ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆ పార్టీ అభిమానులు, వ్యతిరేకులు కూడా కుతూహలంగా ఉంటారు. పహల్గాం దాడి గురించి తాజాగా ఓ వింత ప్రశ్న అసదుద్దీన్ కి ఎదురైంది. దానికి ఆయన ఎంతో తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు.
అసదుద్దీన్ ప్రధానిగా ఉంటే
పహల్గాం దాడి సమయంలో మీరు ప్రధానిగా ఉండి ఉంటే స్పందన ఎలా ఉండేది అని ఓ విలేకరి అసదుద్దీన్ ని సూటిగా ప్రశ్నించారు. దీనికి ఆయన అంతే సూటిగా సమాధానం చెప్పారు. ఇది ఊహాజనిత ప్రశ్న అని, తాను అలాంటి ఊహా లోకంలోకి వెళ్లనని కుండబద్దలు కొట్టారు. ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనన్నారు. “నేను వాస్తవంలో ఉంటాను. నా పరిధి ఎంత మేరకో నాకు స్పష్టంగా తెలుసు. మా లక్ష్యం కేవలం అధికారంలో కూర్చోవడం కాదు, మంత్రి పదవులు కూడా కాదు.” అని అన్నారు.
తెలివిగా తప్పించుకున్నారా?
పహల్గాం దాడి తర్వాత మీరు ప్రధాన మంత్రి అయితే ఏం చేస్తారు అని ఇంకెవర్నయినా ప్రశ్నించి ఉంటే, పాకిస్తాన్ పీచమణిచేస్తాం అనే సమాధానం వినిపించేది. కానీ అసదుద్దీన్ అలా చెప్పే సాహసం చేయలేదు. అదే సమయంలో పాక్ విషయంలో సానుభూతి కూడా చూపలేదు. తెలివిగా ఆ ప్రశ్నను తప్పించుకున్నారు.
టార్గెట్ మోదీ..
ప్రశ్న తనకు వేసినా, అసదుద్దీన్ తెలివిగా ప్రధాని మోదీని టార్గెట్ చేయడం విశేషం. అసలు ఆపరేషన్ సిందూర్ ఎందుకు ఆగిపోయిందంటూ ఆయన లాజిక్ తీశారు. యుద్ధం మొదలైంది, పాకిస్తాన్ కి సరైన జవాబు ఇవ్వడానికి మనకో అవకాశం దొరికింది. అలాంటి సమయంలో యుద్ధం ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు అసదుద్దీన్. అసలు యుద్ధం ఎందుకు ఆగిందో తనకే కాదు, చాలామందికి తెలియదన్నారు. దేశం మొత్తం ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్దంగా ఉన్న సమయంలో యుద్ధాన్ని ఆపేశారంటూ మోదీని టార్గెట్ చేసారు అసదుద్దీన్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కోరుకుంటున్న భారత్.. పార్లమెంట్ లో కూర్చుని చర్చిస్తే ఏం ఉపయోగం అని ప్రశ్నించారు.
ఆనాడు ఏం జరిగింది?
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంపై ఉగ్రదాడి జరిగింది. కాల్పుల్లో ఒక నేపాలీ జాతీయుడితో సహా 26 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్ర స్థావరాలను అటాక్ చేసింది. యుద్ధం కొనసాగుతుండగానే అకస్మాత్తుగా కాల్పుల విరమణపై ప్రకటన వెలువడింది. రెండు రోజులపాటు జరిగిన దాడులు మే 10న ముగిశాయి. ఇక ఈ కాల్పుల విరమణపై కూడా పెద్ద చర్చ నడుస్తోంది. దీనికి కారణం తానేనంటూ డబ్బా కొట్టుకుంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. కాదు, మేమే వారికి ప్రాణ భిక్ష పెట్టామని భారత్ చెబుతోంది. మొత్తానికి పాకిస్తాన్ కి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పకుండా కాల్పుల విరమణ ప్రకటిండచం చాలామందికి ఇష్టం లేదు. అయితే యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే ఇరువైపులా నష్టం ఉంటుందనే విషయం మాత్రం వాస్తవం. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పామని భారత ప్రభుత్వం ప్రకటించింది.