Ramreddy Damodar Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్‌రెడ్డి ఇక లేరు. ఆయన బుధవారం రాత్రి మరణించారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. కొద్దిరోజులుగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు.
దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాత లింగాల గ్రామానికి చెందిన రామిరెడ్డి నారాయణరెడ్డి-కమలమ్మ దంపతుల ముద్దు బిడ్డ దామోదర్‌రెడ్డి. 1952 సెప్టెంబరు 14న ఆయన జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఆయన ఎదిగారు.తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు ఐదుసార్లు పోటీ చేశారు. అందులో నాలుగుసార్లు విజయం సాధించారు.
కేవలం ఒక్కసారి మాత్రమే ఆయన ఓటమి పాలయ్యారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం ఘనత ఆయన సొంతం. 1999లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఆయన టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 2004లో టీడీపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు.
వైఎస్ హయాంలో మంత్రిగా
సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2009లో టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొంది వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత జరిగిన 2014-23 మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు ఆయన. ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామసాగర్ జలాలను తరలించేందుకు విశేష కృషి చేశారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ALSO READ: లక్షమందితో బతుకమ్మ పండుగ చేసి చూపిస్తా-కవిత
ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. దామోదర్‌రెడ్డి మృతిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు ఆయన మృతి తీరని లోటని అన్నారు.
శనివారం తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు దామోదర్ రెడ్డి మృతి వార్త తెలియగానే ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగారు దామోదర్‌రెడ్డి. నిజాయితీ గల నాయకుడిగా ప్రజాసేవలో ఆయన చూపిన తపన ఎప్పటికీ మరువలేమని నేతలు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.