GHMC Illegal: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అతి పెద్ద కార్పొరేషన్ జీహెచ్ఎంసీ అధికారుల పరిస్థితి మిగిలిన రెండు కార్పొరేషన్ అధికారులతో పోలిస్తే చాలా భిన్నంగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ రూటు సెపరేటు గా కన్పిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం గచ్చిబౌలీలోని అంజయ్యనగర్ లో 50 గజాల స్థలంలో నిర్మించిన ఏడు అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు మృతి చెందిన ఘటనతో స్పందించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు చేపడుతుంది.
అక్రమ నిర్మాణాలపై చర్యలు ఏవి..?
మల్కాజ్ గిరి మున్సిపల్ అధికారులు కూడా తమ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై సీరియస్ గా చర్యలు చేపట్టడంతో పాటు రోడ్లు, నాలాలను కబ్జా చేసి నిర్మిస్తున్న భవనాలను, వ్యాపార సంస్థలపై కూడా చర్యలు చేపడుతున్నారు. కానీ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీ మాత్రం అక్రమ నిర్మాణాలపై ఇంకా చర్యలను మొదలు పెట్టకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధి, సిబ్బంది, అధికారుల సంఖ్యను గమనిస్తే జీహెచ్ఎంసీ పరిధి ఎక్కువగా ఉండటంతో పాటు వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది కూడా ఎక్కువగా ఉన్నా, చర్యలు ఎందుకు చేపట్టడం లేదన్న ప్రశ్నలున్నాయి.
సీఎంసీ ముందంజ.. జీహెచ్‌ఎంసీ వెనుకంజ
ముఖ్యంగా సీఎంసీం, ఎంఎంసీ కార్పొరేషన్ల లో సిబ్బంది, అధికారుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉన్నా, వారు ఒక వైపు సర్ విధులు నిర్వహిస్తూనే, మరో వైపు అక్రమ నిర్మాణాలపై ఎన్ ఫోర్స్ మెంట్ చర్యలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, ఫుట్ పాత్ ఆక్రమణలను ప్రతి శనివారం తొలగించాలని ఆదేశాలున్నా, రెండు కార్పొరేషన్ల పరిధిలో ప్రతి వారం ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగిస్తుంటే, జీహెచ్ఎంసీ పరిధిలో కొద్ది నెలలుగా ఫుట్ ఆక్రమణలను తొలగించటం లేదు. ఇందుకు కారణాలేమిటీ? అన్నది క్యూర్ పరిధిలో హాట్ టాపిక్ గా మారింది.
ఎక్కువ ఫిర్యాదులు అక్రమ నిర్మాణాలపైనే
ప్రతి సోమవారం ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి స్వీకరిస్తున్న ఆర్జీలు, ఫిర్యాదుల్లో సగానికి పైగా ఆర్జీలు, ఫిర్యాదులు అక్రమ నిర్మాణాలకు సంబంధించినవే ఉన్నా, అధికారులు ఏ మాత్రం చర్యలు చేపట్టకపోవటం వెనకా కారణాలేమిటీ? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు మామూలు రోజుల్లోనూ అక్రమ నిర్మాణాలపై కమిషనర్ చాంబర్ కు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు ఫిర్యాదులు అందుతున్న వాటిపై కనీసం క్షేత్ర స్థాయి పరిశీలనలు జరపకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది.
Also Read: ఇవన్నీ మీ తాత ముత్తాతల ఆస్తులా కేటీఆర్? అజీజ్ నగర్‌లో చామల రచ్చ!
భవనం కూలి ఇద్దరు మృతి..
ఏడు అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు మృతి చెందిన ఘటనతో సీరియస్ గా స్పందించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమ పరిధిలోని నిర్మాణ దశలో ఉన్న అన్ని భవనాలను తనిఖీలు చేస్తూ అక్రమంగా నిర్మిస్తున్న భవనాలతో పాటు తీసుకున్న అనుమతులను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా జరుగుతున్న నిర్మాణాలపై ఎన్ ఫోర్స్ మెంట్ చర్యలను చేపడుతుంది. ప్రతి రోజు సీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పదుల సంఖ్యలో కొత్త భవనాలను తనిఖీ చేసి, అనుమతులను వెరిఫై చేస్తూ, తీసుకున్న అనుమతులను ఏ మాత్రం ఉల్లంఘించినా, అలాంటి భవనాలకు నోటీసులు జారీ చేసి కేవలం ఇరవై నాలుగు గంటల పాటు సమయమిచ్చి, ఆ తర్వాత నేరుగా కూల్చివేత పనులను చేపడుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే సర్ లేదు కదా?
అలాగే మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కూడా తన పరిధిలోని అక్రమ నిర్మాణాలు, రోడ్డు, నాలాల కబ్జాలపై కొరడా ఝళిపిస్తుండగా, జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాలపై స్పందన లేకపోవటం చర్చనీయాంశంగా మారింది. మూడు కార్పొరేషన్లలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ ఫిర్యాదులు, ఆర్జీలు వస్తున్నా, ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్న ప్రశ్నకు కొందరు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విధుల్లో బిజీగా ఉన్నామని సమాధానం చెప్పటం గమనార్హం. మిగిలిన రెండు కార్పొరేషన్లు సీఎంసీ, ఎంఎంసీ ల్లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విధులను నిర్వహిస్తూనే అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడుతుండగా, జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే సర్ లేదు కదా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోనే అక్రమ నిర్మాణాలు..
సుమారు 2 వేల పై చిలుకు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అత్యధికంగా విస్తీర్ణంతో మూడు కార్పొరేషన్లలో పెద్ద కార్పొరేషన్ గా జీహెచ్ఎంసీ ఎక్కువ మంది జనాభాకు సేవలందిస్తుంది. జీహెచ్ఎంసీ కన్నా తక్కువ విస్తీర్ణం కలిగి, జీహెచ్ఎంసీకి కన్నా చిన్న కార్పొరేషన్లు అయిన సీఎంసీ, ఎంఎంసీ లు తమ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంటే, ఉన్న పరిధిని బట్టి అత్యధికంగా అక్రమ నిర్మాణాలున్న జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఏ ఒక్క అక్రమ నిర్మాణంపై చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. గతంలో నిర్మాణంలో ఉన్న భవనాలు కుప్పకూలి కార్మికులు మృతి చెందిన ఘటనలపై స్పందించిన కోర్టు అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి? వాటిపై కార్పొరేషన్ ఎలాంటి చర్యలు చేపడుతుందని గతంలో ప్రశ్నించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 30 వేల వరకు అక్రమ నిర్మాణాలుంటాయని వెల్లడించిన జీహెచ్ఎంసీ దశల వారీగా అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడుతున్నామని సమాధానం చెప్పినట్లు సమాచారం.
40 వేలకు చేరిన అక్రమ నిర్మాణాలు..
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాల సంఖ్య దాదాపు 40 వేలకు పెరిగినట్లు కూడా అంచనాలున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి కేవలం కూతవేటు దూరంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, నేరుగా ప్రధాన కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేసినా జీహెచ్ఎంసీ స్పందించట లేదని పలువురు ఫిర్యాదుదారులు వాపోతున్నారు.
Also Read: జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థులకు ముప్పు? కేకే కమిటీకి టీఆర్‌ఎస్ సంచలన నివేదిక!