Danam Nagender: స్వేచ్ఛ బ్యూరో: తన అనర్హత వేటుపై దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ, రాజకీయంగా తన తదుపరి అడుగులు ఎలా ఉంటాయనే అంశంలో సస్పెన్స్ గా మారింది. బీఆర్ ఎస్ పార్టీ బీ –ఫామ్ పై ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని, మళ్లీ హస్తం పార్టీ బీ ఫామ్ నుంచి ఎంపీగా పోటీ చేయడంతో ఇరకాటంలో పడ్డ దానంపై.. చివరకు హైకోర్టు జోక్యం చేసుకొని అనర్హత వేటు వేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి దానంకు బోనస్ లభించబోతున్నదనే ఊహాగానాలు విస్తృతమయ్యాయి. దానం నాగేందర్ కు పార్టీలో బిగ్ ఆఫర్ దక్కబోతుందని కాంగ్రెస్ పార్టీతో పాటు సోషల్ మీడియా వేదికల్లోనూ చర్చ జరుగుతున్నది.
దానం ఎపిసోడ్ లో ఈ కొత్త చర్చ
మంత్రి పదవి దక్కించుకోవాలని భావిస్తున్న దానంకు.. ఎమ్మెల్సీ ప్లస్ మినిస్టర్ ఇవ్వబోతున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిళ్లలో ఊపందుకున్నది. దానం నాగేందర్ కూడా ఇందుకు సానుకూలంగా ఉంటారనే అభిప్రాయాన్ని పార్టీ నేతల నుంచి వ్యక్తం అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బలమైన సామాజికవర్గ నేతగా, మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా దానం నాగేందర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆయన, ఈసారి ఎలాగైనా మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. పాతతరం కాంగ్రెస్ నాయకుడిగా తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని, గ్రేటర్ రాజకీయాలపై ఉన్న పట్టును అధిష్ఠానం వద్ద ప్రస్తావిస్తూ మంత్రి పదవి కోసం గట్టిగానే పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దానం ఎపిసోడ్ లో ఈ కొత్త చర్చ మొదలైంది.
పోటీ చేయాల్సి వచ్చినా.. బెర్త్ ..?
ఒక వేళ ఉప ఎన్నిక వచ్చినా, ఎన్నికల్లో నిలబడేందుకు తాను సిద్ధమేనంటూ దానం నాగేందర్ ఇప్పటికే ఆసక్తిని కనబరిచారు. ఇదే క్రమంలో పోటీ చేసి గెలిస్తే, తప్పక మంత్రి పదవి ఇవ్వాలనే ప్రపోజల్ కూడా పెట్టినట్లు సమాచారం. ఫిరాయింపుల చట్టం ద్వారా దానంకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు హైకమాండ్ ఈ బంఫర్ ఇస్తున్నట్లు పార్టీలో టాక్. తాజాగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నందున హైకోర్టు ఆదేశాలను తప్పక పాటించాల్సిందేనని సుప్రీం కోర్టు కూడా చెప్పే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఈక్రమంలో ఆయన అనర్హత వేటు లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చనే చర్చ ఉన్నది.
ఎమ్మెల్సీ ప్లస్ మంత్రి వర్కవుట్ అయితే..
ఇక దానం నాగేందర్ ఎమ్మెల్సీ కమ్ మంత్రి ఆఫర్ ను ఆహ్వానిస్తే, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయా రెడ్డికి ఛాన్స్ లభించే అవకాశం ఉన్నది. పీజేఆర్ కుమార్తె, సీనియర్ రాజకీయ నాయకురాలు విజయా రెడ్డి ని బరిలోకి దించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో పీజేఆర్ కుటుంబానికి ఉన్న అపారమైన అభిమానం, విజయా రెడ్డికి ఉన్న క్షేత్రస్థాయి పరిచయాలు కాంగ్రెస్‌కు కలిసివస్తాయని భావిస్తున్నారు. పైగా మంత్రి పదవి ఇస్తే దానం నాగేందర్ కూడా స్వచ్ఛందంగా ఈ స్థానాన్ని విజయా రెడ్డికి కేటాయించడాన్ని స్వాగతించే అవకాశం ఉన్నది. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే, ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఓవరల్ గా ఖైరతాబాద్ నియొజకవర్గం రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయమైంది.
Also Read: కరీంనగర్‌లో దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు ఏటీఎమ్‌లలో భారీ చోరీ!