Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: మమ్మల్ని తిడితేనో, జైల్లో పెడితేనో మీ కసి తీరుతుంది అనుకుంటే.. మీరు నా రక్తం అడిగినా, నన్ను జైల్లో వేసినా.. దానికి నేను నూటికి నూరు శాతం సిద్ధం’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రకటించారు. కానీ మీ ఈగోలకు, పంతాలకు పోయి రైతుల పంటలను ఎండబెట్టకండి.. తక్షణమే కన్నెపల్లి, దేవాదుల మోటార్లు పూర్తిస్థాయిలో ఆన్ చేసి రాష్ట్రాన్ని కరువు బారి నుంచి కాపాడండి.. క్రెడిట్ అంతా మీరే తీసుకోండి అని సూచించారు. లేకపోతే ఎండిన ప్రతి పంటకు, రాలిన ప్రతి రైతు కన్నీటి బొట్టుకు తెలంగాణ సమాజం రేపు మిమ్మల్ని దోషిగా బోనులో నిలబెడుతుంది..ఖబర్దార్ అని హెచ్చరించారు.
తెలంగాణ భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. రైతులు సాగునీరు అడిగితే.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్టుతో కొట్టాలి అని ఒక సీఎం మాట్లాడటం అత్యంత జుగుప్సాకరం అన్నారు. మొన్నటి వరకు గోదావరిలో నీళ్లే లేవు అని అబద్ధం చెప్పినకాంగ్రెస్ నేతలు.. కేటీఆర్ అక్కడికి వెళ్లి పారుతున్న గోదావరిని లైవ్ లో చూపించగానే నాలుక కరుచుకున్నారన్నారు. మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి మోటార్లు ఎలా నడుపుతారని సీఎం అజ్ఞానంతో మాట్లాడుతుంటే, పక్కనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ లాక్కుని సరిచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
కన్నెపల్లి మోటార్లు 93.5 మీటర్ల ఎత్తులో నడుస్తాయి.. ప్రస్తుతం నదిలో లక్ష క్యూసెక్కుల వరద పోతోంది.. నీటిమట్టం 97.5 మీటర్ల ఎత్తులో ఉంది. గేట్లు మూయాల్సిన అవసరమే లేదన్నారు. నిన్నటి దాకా నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్లు అన్న సీఎం.. ఇప్పుడు వాళ్లు నీళ్లు ఎత్తమని టెక్నికల్ సూచన చేయగానే వారిని జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏనాడూ రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ ఫీజబుల్ కాదని చెప్పలేదన్నారు. మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తీసుకెళ్లడం కష్టం కాబట్టి, వరస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా తీసుకెళ్లమని సాక్షాత్తూ వారే జస్టిస్ ఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ ఇచ్చారన్నారు. ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు సైతం కేవలం రూ. 8.5 కోట్ల ఖర్చుతో ఒక కాఫర్ డ్యామ్ కట్టుకుని నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్లొచ్చని ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. కానీ నీళ్లు ఎత్తకుండా, మోటార్లు ఆన్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము చేసిన దుష్ప్రచారం ఎక్కడ బట్టబయలు అవుతుందో అన్న భయంతో కాంగ్రెస్ ఈగోలకు పోతున్నారన్నారు.
Also Read: WhatsApp వాడేవారందరూ తప్పక మార్చాల్సిన 10 ముఖ్యమైన సెట్టింగ్స్!
ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ కట్టిందని చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు. 2004లో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు మంత్రిగా నా పేరు కూడా శిలాఫలకంపై ఉందన్నారు. 2014 వరకు రూ.3,347 కోట్లు ఖర్చుపెట్టినా అందులో 5 టీఎంసీల నీళ్లు కూడా నిలపలేకపోయారని, కాంగ్రెస్ హయాంలో కేవలం 18,700 ఎకరాల భూసేకరణ, 1448 ఇండ్ల ఆర్ అండ్ ఆర్ మాత్రమే జరిగిందన్నారు.తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 వేల ఎకరాల భూసేకరణ చేసి, 13,296 ఇండ్లు కట్టి పునరావాసం కల్పించిందన్నారు. రూ. 2052 కోట్లు ఖర్చు చేసి 2016 తర్వాతనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో 20 టీఎంసీలు వినియోగంలోకి తెచ్చిందన్నారు.2016 తర్వాతనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో (20 టీఎంసీలు) వినియోగంలోకి తెచ్చిందని, ఈరోజు ఎల్లంపల్లిలో కేవలం 7-8 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4-5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఎన్టీపీసీకి 5, సింగరేణికి 5, హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు అవసరం.. కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పోయి నీళ్లు ఎత్తకపోతే రేపు కరెంట్ ఉత్పత్తి ఆగిపోయి రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు.
బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని అంటున్నారని, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 6.64 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం, పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. మహబూబ్ నగర్ లోనే కాంగ్రెస్ 30 ఏళ్లలో 46 వేల ఎకరాలకు ఇస్తే, మేము 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. 2014-15లో రాష్ట్రంలో పండిన వరి కేవలం 68 లక్షల టన్నులు అని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల 24 గంటల కరెంట్, రైతుబంధు, సాగునీరు వల్ల 2023-24 నాటికి ఏకంగా 2 కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందన్నారు. వరి సాగు 34 లక్షల ఎకరాల నుంచి కోటి 18 లక్షల ఎకరాలకు పెరిగిందని, ఇది ముమ్మాటికీ కేసీఆర్ ఘనత గా అభివర్ణించారు. అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీళ్లు ఆపితే భద్రాచలం మునిగిపోతుందనడం శుద్ధ అబద్ధం అన్నారు.
అన్నారంలో 5 టీఎంసీలు, సుందిల్లలో 3.8 టీఎంసీలు మొత్తం 8.8 టీఎంసీలు నిలిపితే.. ఒకవేళ రెండు బ్యారేజీలకు ఒకేసారి ఇబ్బంది వచ్చినా కిందికి వెళ్లేది కేవలం 1.10 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే. 2022లో ఏకంగా 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే భద్రాచలం ఏమీ కాలేదన్నారు.అలాంటిది లక్ష క్యూసెక్కులకే భద్రాచలం కొట్టుకుపోతుందని చెవిలో పూలు పెడుతున్నారని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కొట్టుకుపోయాయని పదే పదే అబద్ధాలు చెబుతున్నారని, వాస్తవానికి ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిందే 87 వేల కోట్లు అన్నారు. ఈ 87 వేల కోట్లలో మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య ఉన్నది కేవలం 10% మాత్రమే. మిగతా 90% సిస్టమ్ మిడ్ మానేరు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అంతా ఇంటాక్ట్ గా సురక్షితంగా ఉందన్నారు.
Also read: POCSO Monitoring: ఆ ఒక్క తప్పే ఆరు ప్రాణాలను బలితీసుకుందా.. షాబాద్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!
ఎక్స్ పర్ట్స్ ను, ఆర్మీ ఇంజనీర్లను తెచ్చామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వానికి ఏ సీజన్ లో పనులు చేయాలో తెలియదు. మీరు ఆర్మీ ఇంజనీర్లను తెచ్చి ఇంత పడగొట్టింది ఏంటి? ఎస్ఎల్బీసీ కుప్పకూలి 8 మంది చనిపోవడమా? సుంకిశాల ప్రాజెక్టు కూలిపోవడమా?వట్టెం పంప్ హౌస్ మునిగిపోవడమా?ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడమా?ఇవేనా మీ ఆర్మీ ఇంజనీర్ల గొప్పతనం అని నిలదీశారు. నాడు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్డీఎస్ఏ చట్టం రాష్ట్రాల హక్కులు కాలరాయడమే అని వ్యతిరేకించి, రాతపూర్వకంగా ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేడు అదే ఎన్డీఎస్ఏ బైబిల్ లాగా కనిపిస్తోందన్నారు. మేడిగడ్డపై రిపోర్ట్ ఇచ్చిన ఎన్డీఎస్ఏచైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, అతుల్ జైన్.. 2019 నుంచి 2024 వరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సీఈవోలు అన్నారు.వారి హయాంలోనే పోలవరం కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ ఆరు సార్లు కొట్టుకుపోయి రూ. 7 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందన్నారు. ఆ 7 వేల కోట్లు నష్టం చేసిన వాళ్లకు ప్రమోషన్లు ఇచ్చి ఇక్కడకు పంపితే.. వాళ్లు మేడిగడ్డ 3 పిల్లర్ల కుంగుబాటుపై రిపోర్టులు ఇస్తారా? అని నిలదీశారు.
ఎల్నినో కరువు పరిస్థితుల్లో ప్రతి చుక్క ముఖ్యం.. ఇప్పుడున్న 50-60 వేల క్యూసెక్కుల వరదను కన్నెపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తుకోవాలన్నారు. దేవాదులలో 10 మోటార్లు ఉంటే 4 మాత్రమే నడుపుతూ, 2500 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట కేవలం 1200 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతున్నారన్నారు. వరంగల్, ధర్మసాగర్, పాలకుర్తిలలో 75% చెరువులు ఎండిపోయినా పట్టించుకోవడం లేదన్నారు. మోటార్లు బంద్ పెట్టి, నీళ్లు కిందకు వదిలేస్తూ ఆంధ్రాలోని పట్టిసీమకు మేలు చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాలికి వదిలేసి, లా అండ్ ఆర్డర్ చూసే ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి నిన్న మధ్యాహ్నం గోల్ఫ్ ఆడుకుంటూ కూర్చున్నాడని,ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అని మండిపడ్డారు.
Also Read: CURE Bill: లీకైన తెలంగాణ క్యూర్ బిల్లు సీక్రెట్స్.. ఇకపై మున్సిపాలిటీల్లో నడవని మేయర్ల హవా!