POCSO Monitoring: స్వేచ్చ బ్యూరో: ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్’ సంక్షిప్తంగా పోక్సో చట్టం. మైనారిటీ తీరని బాలికలు. బాలుర భద్రతకై తీసుకొచ్చిన చట్టం ఇది. 2011లో దీని రూపకల్పన జరుగగా ఆ మరుసటి సంవత్సరం మే 12న భారత పార్లమెంట్ దీనిని ఆమోదించింది. ఇక, 2012, నవంబర్ 14న దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. నిజానికి ఈ చట్టంలో కఠినమైన సెక్షన్లు ఉన్నాయి. చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి యావజ్జీవ శిక్ష కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడే అవకాశముంది. ఇంత పటిష్టంగా చట్టం ఉన్నా దానిని అమలు చేసే అధికారుల్లో కొందరు కనబరుస్తున్న ఉదాసీనత కారణంగా దారుణాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా పోక్సో చట్టం ప్రకారం నమోదైన కేసుల్లోని నిందితులపై పోలీసుల నిఘా కనీస స్థాయిలో కూడా ఉండక పోవటం కొన్ని వెసులుబాట్లు ఉండటం దీనికి ప్రధాన కారణమవుతోంది. తాజాగా రాష్ట్రాన్ని వణికించిన ఆరు హత్యల నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయంగా మారింది. దైవలాపురం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఏడేళ్ల క్రితమే సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తండ్రి. కాగా, అదే గ్రామంలో ఉంటున్న మైనర్ బాలికపై అతని కన్నుపడింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆరునెలలుగా వెంటపడి వేధిస్తున్నాడు. నానాటికీ ఈ వేధింపులు అధికమవటంతో బాలిక తల్లి షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం ప్రకారం రాజ్ కుమార్ పై కేసులు నమోదు చేశారు.
అయితే, చట్టంలోని కఠినమైన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయలేదు. ఎలాంటి లైంగిక దాడి జరపలేదు. కేవలం వెంటపడి వేధించాడని ఏడేళ్లలోపు శిక్షలు పడే అవకాశమున్నా సెక్షన్లు పెట్టారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే జైళ్లల్లో ఖైదీల రద్ధీని తగ్గించటానికి కొంతకాలం క్రితం సుప్రీం కోర్టు ఏడేళ్లలోపు శిక్షలు పడే అవకాశాలు ఉన్న కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వొచ్చని చెప్పింది. సరిగ్గా ఈ అంశం రాజ్ కుమార్ కు కలిసొచ్చింది. ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసులు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలేదు. స్టేషన్ బెయిల్ పై వదిలేశారు.
Also Read: Water Tourism: ఇక గోవా వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో నీటిపై తేలియాడే రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..!
వదిలేయటమైతే వదిలేశారుగానీ రాజ్ కుమార్ పై పోలీసులు కనీస స్థాయిలో కూడా నిఘా పెట్టలేదు. అతని కదలికల గురించి తెలుసుకోలేదు. సీనియర్ పోలీసు అధికారులు చెప్పిన ప్రకారం అమెరికాలో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారి పూర్తి వివరాలను రికార్డుల్లో (సెక్స్ అఫెండర్ రిజిష్టర్) నమోదు చేస్తారు. బెయిల్ పై బయటకు వచ్చినా.. శిక్ష ముగించుకుని విడుదలైనా వారిపై ఏళ్ల తరబడి నిఘా పెడతారు. ప్రతీ కదలికను గమనిస్తారు. పిల్లలు ఎక్కువగా ఉండే స్కూళ్లు, పార్కులు వంటి చోట్లకు వెళ్లకుండా అక్కడి కోర్టులు ఆంక్షలు కూడా విధిస్తాయి. ఇక, బ్రిటన్లో సెక్సువల్ హార్మ్ ప్రివెన్షన్ ఆర్డర్స్ ద్వారా నిందితుల కదలికలు, పిల్లలతో సంబంధాలు, చివరకు ఇంటర్ నెట్ వినియోగంపై కూడా పరిమితులు విధిస్తారు.
ఇక, ఆస్ట్రేలియాలోని కొన్ని స్టేట్స్ లో లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ పెడతారు. నిత్యం పోలీస్ పర్యవేక్షణను కొనసాగిస్తారు. మన దేశంలో మాత్రం పోలీసులు ఇలాంటి చర్యలు చేపట్టటం లేదు. రాజ్ కుమార్ విషయంలో కూడా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు తప్పితే అతను ఎక్కడ ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడు? కదలికలు ఏమిటి? అన్నదాని గురించి పట్టించుకోలేదు. ఇదే అవకాశంగా తనపై కేసులు పెట్టిన బాలికను ఆమె అమ్మ, నాయనమ్మను హత్య చేసిన రాజ్ కుమార్ తన భార్య, ఇద్దరు కొడుకులను కూడా కిరాతకంగా చంపేశాడు. ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోక తప్పదని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వటాన్ని పూర్తిగా నిలిపి వేయాలన్నారు. కేసు నమోదు చేసిన వెంటనే అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్ చేయాలని చెప్పారు. బెయిల్ పై విడుదలైనా.. శిక్ష ముగించుకుని బయటకు వచ్చినా వారిపై నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. అప్పుడే పోక్సో యాక్ట్ అంటే నేరాలకు పాల్పడే వారిలో భయం పుడుతుందన్నారు. లేనిపక్షంలో అది కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also read: Substations: వావ్ క్రేజీ ఐడియా.. తొలి దశ సక్సెస్ అయితే సిటీ మొత్తం ఇదే ట్రెండ్..?