సిద్దిపేట, స్వేచ్ఛ: ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది కానీ, ఆచరణలో జరగడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ సర్కార్ పండుగ పూట జీతాలు ఇవ్వక ఉద్యోగుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. మూసీ కోసం లక్ష 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మీరు జీతాలు ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. వృద్ధులకు 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారెంటీ అంటే గోల్డెన్ గ్యారెంటీ అన్నారు కానీ, అది గొల్ మాల్, గోబెల్స్ గ్యారెంటీగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు కూడా దొరకడం లేదని, హాస్టళ్లలో విద్యార్థులు నీళ్ల చారుతో అన్నం తింటున్నారని ఆరోపించారు. హరీష్ రావును కలిసిన తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజేస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులను వివరించారు.
Also Read: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్.. 2011 జనాభా లెక్కల ప్రకారమే..
ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు హరీష్ రావు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా, సుమారు 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం అగమ్యగోచరంగా మార్చిందని విమర్శించారు. విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఇంతకు మించిన ఉదాహరణ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.19 వేల కోట్లను ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విడుదల చేసినట్టు గుర్తు చేశారు. ప్రతి ఏడాది సగటున క్రమం తప్పకుండా రూ.2 వేల కోట్లు విడుదల చేసిందని, కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కేవలం విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చెల్లించినట్టు వివరించారు. దసరా, దీపావళి వేళ సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేకపోతున్నారని, సిబ్బంది నుండి తమపై విపరీతమైన ఒత్తిడి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.