Botsa Satyanarayana: రైతులు, ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆక్షేపించారు. మొంథా తుఫాను ప్రకృతి విపత్తులో పంటలు, రైతులు గణనీయంగా నష్టపోయినా, ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదని, సహాయం అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
మీడియాతో మాట్లాడుతూ, “ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరంగా ఉంది. తుఫాను పంట నష్టంపై కూడా స్పష్టత లేదు. మా హయాంలో రైతులకు గిట్టుబాటి ధరలు, సబ్సిడీలు అందించాం. పంట ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వం కట్టాలని మా విధానం. కానీ కూటమి ప్రభుత్వం రైతులను ఇన్సూరెన్స్ కట్టుకోమని బాధ్యత విధిస్తోంది” అని విమర్శించారు.
రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు మాటలకే పరిమితమవుతున్నారని బొత్స అన్నారు. “అన్ని రకాల పంటల్లో నష్టం జరిగింది. నీరు పోయినా పంట నష్టంపై ప్రకటనలు చేయలేదు. రైతులకు భరోసా కల్పించే చర్యలు లేవు. జగన్ రైతుల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్ఆర్, జగన్ హయాంలో రైతులకు మంచి జరిగింది. ఇప్పుడు మంచి చేయడం మానేసి విమర్శలు చేస్తున్నారు.” అని చెప్పారు.
Read Also: Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?
ఈ 18 నెలల్లో ప్రభుత్వం ఏ జిల్లాల్లో ఎంత మేలు చేసిందో, ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతులు కూటమి ప్రభుత్వానికి అవసరం లేనట్టు వ్యవహరిస్తున్నారని, రూ.2 లక్షలకు పైగా అప్పులు పెట్టించి బాధలు పెంచారని ఆరోపించారు. వ్యవసాయం, విద్య, వైద్యం ప్రధానమని బొత్స పేర్కొన్నారు. “కూటమి విధానం ప్రతి వర్గానికి ఏదో ఒకటి వద్దని చెబుతోంది. వైద్య విద్యను అమ్మేస్తామంటే సరైనది కాదు. విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత” అని అన్నారు.
కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్ 1న జరిగిన ఈ ఘటనలో 9 మంది మరణించారు. “ప్రైవేట్ ఆలయమంటూ బాధ్యత తప్పించుకుంటున్నారు. ఎక్కడైనా జనం ఎక్కువగా ఉంటే ప్రభుత్వ బాధ్యత లేదా? భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా వేయడం లేదా? చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఇలాంటి ఘటనలు జరుగుతాయి. తిరుపతి, సింహాచలం ఘటనల నుంచి ఏం నేర్చుకున్నారు? SOPలు సిద్ధం చేశారా?” అని ప్రశ్నించారు. ఘటనకు కారణాలు, బాధ్యులను చెప్పాలని, SOPలు ఏమైనా తయారు చేశారా అని డిమాండ్ చేశారు. రైతులు, వైద్యం, విద్య, భక్తుల అంశాల్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బొత్స ఖండించారు.
“కూటమి పాలన వల్ల ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. సమస్యలు తెలుసుకోవడానికి పెద్ద జ్ఞానం అవసరం లేదు. కళ్లతో చూసి పని చేస్తే మేలు జరుగుతుంది. ఏదైనా జరిగితే వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది” అని విమర్శించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, కాశీబుగ్గ ఘటనకు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.