KTR vs CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ‘కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు’ అనే వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ముస్లింలను అవమానించడమేనని.. కాంగ్రెస్ పుట్టకముందు నుంచే ముస్లింలు ఉన్నారని.. రేవంత్ రెడ్డి తన అజ్ఞానం నుంచి బయటకు రావాలని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ లేకపోయినా హిందువులు ఉన్నట్లే.. కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగడం లేదని, కేసీఆర్ సూచన మేరకే కేవలం బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పనులను ప్రజలకు చెప్పే పనిలో ఉన్నానని తెలిపారు. అయితే.. రేవంత్ రెడ్డి తనపై ఉన్న ఏసీబీ కేసులో లై డిటెక్టర్ టెస్ట్‌కు రావాలని సవాల్ విసిరారు. దానికి ప్రతిగా, ఫార్ములా-ఈ రేసు కేసులో తాను లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా- ఈ కేసులో విషయం లేకపోవడం వల్లే గవర్నర్ అనుమతి కోరుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఎప్పుడో అనుమతి ఇచ్చారని కూడా కేటీఆర్ గుర్తుచేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నిరాశ, నిస్పృహతో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమనే విషయం రేవంత్‌కు అర్థమైందని, అందుకే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే, రేవంత్ రెడ్డి కంటే గట్టిగా మాట్లాడగల సత్తా తనకు ఉందని.. కానీ కేసీఆర్ సూచన మేరకు వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ, సచివాలయం, గాంధీ భవన్… ఎక్కడైనా సరే, రేవంత్ రెడ్డి తనతో చర్చకు రావాలని కోరారు.
హోంశాఖను చూస్తున్న రేవంత్ రెడ్డి హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. హైదరాబాద్‌లో గన్, డ్రగ్ కల్చర్ పెరిగిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ చెత్త సిటీగా, క్రైమ్ సిటీగా మారిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో నిర్మించిన అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిర్మించిందో చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్లలో వంద లింక్ రోడ్లు నిర్మించామన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక ఒక్క గుంత కూడా పూడ్చలేదని ఆయన ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ ‘కటింగ్ మాస్టర్’ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, సిటీలో మళ్లీ మంచి నీటి కష్టాలు తెచ్చిపెట్టారని కూడా విమర్శించారు. చెత్త సమస్య పరిష్కారానికి తాము ప్రారంభించిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పక్కన పెట్టిందని, మెట్రో నిర్మించిన ఎల్‌అండ్‌టీ (ఎల్ అండ్ టీ) సంస్థను రేవంత్ రెడ్డి బెదిరించి పంపించారని కేటీఆర్ ఆరోపించారు.
ALSO READ: Jubilee Hills bypoll: కేటీఆర్ హైడ్రా పాలిటిక్స్.. బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించక తప్పదా..?