Massively increased power consumption: వేసవి తీవ్రత అప్పుడే పెరుగుతుండడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. బోరుబావుల కింద యాసంగి పంటలను రక్షించుకునేందుకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఫిబ్రవరి నెలలో తొలిసారిగా గరిష్థ విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్లకు దాటింది. ఈ నెల 23న రాష్ట్రంలో 15,031 గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది సరిగ్గా ఇదే రోజున 14,526 గరిష్ఠ విద్యుత్ డిమాండ్ మాత్రమే ఉండగా.. గతేడాది మార్చి 30 న రాష్ట్రంలో అత్యధికంగా 15,497 మెగావాట్ల గరిష్ఠ వాడకం నమోదైంది. కాగా ఈ ఏడాది మార్చి చివరి నాటికి 16,500 మించి.. విద్యుత్ డిమాండ్ పెరగనుందని విద్యుత్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. 1600 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 800 నుంచి వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కాగా, 800 మెగావాట్ల రెండో ప్లాంట్ నుంచి విద్యుత్ ను సరఫరా చేసేందుకు సర్వసిద్ధం చేసారు. పొరుగు రాష్ట్రాలలో 1200 మెగావాట్ల విద్యుత్ బ్యాంకింగ్ కి ఏర్పాట్లు చేసారు. దీని ద్వారా రాష్ట్రంలో విద్యుత్ మిగిలినప్పుడు వేరే రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చి మన రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండనుంది.
Read more: మెట్రో 2.O.. 7 కారిడార్లకు గ్రీన్ సిగ్నల్.. త్వరలో శంకుస్థాపన
గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో 6.9 శాతం, ఫిబ్రవరిలో 4.6 శాతం వినియోగం పెరిగింది.
గతేడాది రోజువారీ విద్యుత్ వినియోగం 242.95 మిలియన్ల యూనిట్లు కాగా.. ఈ ఏడాది ఇదే సమయంలో 256.74 మిలియన్ల యూనిట్లకు చేరింది.
సాగునీరు లేక పెరగనున్న విద్యుత్ అవసరాలు ..
కృష్ణా బేసిన్ లోని శ్రీశైలం, నాగార్జునాసాగర్ జలాశయాల్లో నిల్వలు అడుగంటి పోవడంతో కాల్వల క్రింద ఆయకట్టు సాగుకు నీళ్లు లేవు. మరమ్మత్తులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సైతం ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో బోరుబావుల క్రింద విద్యుత్ వినియోగం మార్చి చివరి లోగా 16500-17000 మెగావాట్లు నమోదయయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దక్షిణ తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాలో విద్యుత్ సరఫరా చేసే దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ పరిధిలో గతేడాదితో పోల్చుకుంటే ఈ జనవరిలో 6.67 శాతం, ఫిబ్రవరిలో 6.24శాతం విద్యుత్ వినియోగం పెరగనుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో 9.47 శాతం, ఫిబ్రవరిలో 12.27 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. ఫిబ్రవరి 2023 లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 2,930 మెగావాట్లు నమోదు కాగా, 2024 ఫిబ్రవరి 23న 3,174 మెగావాట్లు నమోదయ్యింది. నగరంలో గతేడాది జనవరి,ఫిబ్రవరిలో సగటు విద్యుత్ వినియోగం 51.69 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది జనవరి లో 57.34 మిలియన్ యూనిట్లు, ఫిబ్రవరిలో 65 మిలియన్ యూనిట్లకు పెరిగింది.