Jubilee Hills Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారని, 30 వేల నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. యూసఫ్ గూడలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కొన్ని చానల్స్ తో ఫేక్ సర్వేలు చేయించుకొని బీర్ఎస్ కుట్రలు చేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనకు… రెండేళ్ల అభివృద్ధి పాలనకు బేరీజు వేసుకొని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి దీపక్ రెడ్డిని బలి పశువును చేశారని మహేష్ గౌడ్ అన్నారు. ‘‘జూబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్ ,బీజేపీకి ఓటు వేసిన నోటాకి వేసినట్లే. నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ప్రజల కష్టాలు పంచుకునే నాయకుడు. బీఆర్ఎస్ నేతలు పొర్లు దండాలు పెట్టిన గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే. రెండేండ్లలో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం చూసి వణుకు పుడుతోంది. సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. బీఆర్‌ఎస్ నియంతృత్వ పాలన, అవినీతి భరించ లేక ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చీకొట్టినా ఆ పార్టీ నేతలకు బుద్ది రాలేదు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్న వ్యక్తి చేసిన అభివృద్ధి జూబ్లీ హిల్స్ లో ఎక్కడ కనిపించడం లేదు. మాగంటి గోపినాథ్ తల్లి ఆవేదన కు కేటీఆర్ జవాబు చెప్పాలి. మాగంటి గోపినాథ్ కొడుకు కు సంధించిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి. నవీన్ యాదవ్ మీద ఒక్క కేసు హరీష్ రావు చూపిస్తే దేనికైనా సిద్ధం’’ అని అన్నారు.
మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరో మూడేళ్ల పాటు అద్భుతమైన అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే 14,230 కొత్త కార్డులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం 2.40 లక్షల మందికి ప్రతి నెలా ఉచితంగా సన్న బియ్యం అందిస్తోందని గుర్తుచేశారు. ముస్లిం సోదర సోదరీమణులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని, అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి కోసం యువకుడు నవీన్ యాదవ్‌ను గెలిపించండి: భట్టి విక్రమార్క
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రసంగించారు. నవీన్ యాదవ్ ఏ పదవిలో లేనప్పుడే అనేక సంక్షేమ, సామాజిక కార్యక్రమాలు చేసిన సేవకుడని, నిరంతరం అందుబాటులో ఉండే స్థానిక, విద్యావంతుడైన యువకుడని ఆయన కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన తపన, సత్తా నవీన్ యాదవ్‌కు ఉన్నాయని, మంత్రులతో సమన్వయం చేసుకుని పనులు (రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు) వేగంగా పూర్తి చేయగలరని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పనులను ఆయన ప్రస్తావించారు. 10 ఏళ్లుగా ఆగిపోయిన రేషన్ కార్డుల జారీని తమ ప్రభుత్వం పునఃప్రారంభించి, అర్హులందరికీ కార్డులతో పాటు సన్న బియ్యం అందిస్తోందని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నియోజకవర్గంలో వేలాది కుటుంబాలకు మేలు చేస్తోందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిన మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ‘వడ్డీ లేని రుణాలను’ అందిస్తోందని, ఒక్క జూబ్లీ హిల్స్‌లోనే 15,000 మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తోందని భట్టి తెలిపారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించేందుకు “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీ స్కూల్”ను మంజూరు చేశామని చెప్పారు. 10 ఏళ్లుగా జరగని గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు నిర్వహించి, 70 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తుచేశారు. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.