Hyderabad: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న భారీ కుట్రను గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. గత సంవత్సర కాలంగా నిఘా పెట్టిన ఏటీఎస్ అధికారులు, ఆయుధాలు సరఫరా చేస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ కావడం కలకలం రేపుతోంది. అరెస్టయిన ముగ్గురినీ గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్‌కు తరలించారు.
అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు రాజేంద్రనగర్ పరిధిలోని ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌గా గుర్తించారు. మొహియుద్దీన్ ఉన్నత విద్యావంతుడు కావడం, ఫ్రాన్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేయడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఇతను నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌కేపీ (ISKP) సభ్యులతో టెలిగ్రామ్ యాప్ ద్వారా నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడైంది.
మొహియుద్దీన్ నివాసంపై గుజరాత్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అతని వద్ద నుంచి 2 గ్లాక్ పిస్టల్స్, 1 బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కాట్రిడ్జ్‌లు (తూటాలు) స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Medak District: దారుణం.. రెండు నెలల కూతురిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసిన కసాయి తల్లి
ఈ ముగ్గురూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్లు యాంటి టెర్రరిస్ట్ పోలీసులు గుర్తించారు. గతంలో హైదరాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడుల తరహాలోనే, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో దాడులు చేయాలని వీరు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం వంటి యాత్రికులపై జరిగిన దాడుల తరహాలో దాడులకు సిద్ధమైనట్లు సమాచారం.
గతంలో దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా, దాని మూలాలు హైదరాబాద్ పాతబస్తీలో ఉండేవనే వాదన ఉండేదని, తాజా ఘటన ఆ వాదనను గుర్తుచేస్తోంది. అరెస్టయిన ముగ్గురినీ ప్రస్తుతం గుజరాత్‌లో విచారిస్తున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు. ఎక్కడెక్కడ దాడులకు ప్లాన్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మహమ్మద్, లష్కరే తొయిబా వంటి సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఏటీఎస్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.