Jubilee Hills Elections: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార హోరుకు తెరపడింది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ సందడి ఆదివారం సాయంత్రంతో అధికారికంగా ముగిసింది. ప్రచార గడువు ముగియడంతో అన్ని పార్టీల ర్యాలలీలు, మైకులు, ప్రచార రథాలు మూగబోయాయి. ఇకపై బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. పోలింగ్ రోజున ఓటర్లు తమ తీర్పును ఈవీఎంల ద్వారా వెల్లడించనున్నారు.
ఈ నేపథ్యంలో, ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ కమీషనర్ మరియు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, జాయింట్ సీపీ తఫ్సిర్ ఇక్బాల్‌తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ మాట్లాడుతూ, పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని, వారి కోసం 139 పోలింగ్ లొకేషన్లలో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వీటిలో 226 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు కర్ణన్ తెలిపారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున, ఈ ఎన్నికల్లో 4 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నట్లు చెప్పారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంను డీఆర్సీ సెంటర్‌గా ఏర్పాటు చేశామని, అక్కడ మూడంచెల భద్రత ఉంటుందని అన్నారు. ఈసారి ఎన్నికల పర్యవేక్షణకు మొదటిసారిగా డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 103 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also: Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు
అనంతరం జాయింట్ సీపీ తఫ్సిర్ ఇక్బాల్ మాట్లాడుతూ, ఎన్నికల బందోబస్తు కోసం 1761 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ. 3 కోట్ల 61 వేల నగదు సీజ్ చేయగా, సరైన ఆధారాలు చూపడంతో రూ. 2 కోట్లకు పైగా తిరిగి విడుదల చేశామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 27 ఎంసీసీ కేసులు, ఇతరత్రా 2,600 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రచారం ముగియడంతో, నియోజకవర్గంలో ఉన్న స్థానికేతరులను (Non-locals) తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం, ఆదివారం (నవంబర్ 9) సాయంత్రం నుండి నవంబర్ 11 (పోలింగ్ రోజు) సాయంత్రం వరకు నియోజకవర్గ పరిధిలో వైన్స్ మూసివేస్తారని అధికారులు తెలిపారు. తిరిగి నవంబర్ 14న (కౌంటింగ్ రోజు) ఉదయం నుండి కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలపై నిషేధం అమల్లో ఉంటుందని వారు స్పష్టం చేశారు.