New Osmania Hospital: హైదరాబాద్ లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మేఘా కంపెనీ ప్రాజెక్టుల విభాగం అధ్యక్షుడు కె. గోవర్ధన్ రెడ్డి గురువారం పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ భవనాల నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. దసరా రోజున ప్రారంభమైన పనులు ఇక శరవేగంగా జరగనున్నాయి.
ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణం రెండున్నర ఏళ్లలో పూర్తి కానున్నాయి. నూతన భవనాల సముదాయాన్ని 26 ఎకరాల విస్తీర్ణంలో 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రెండు వేల పడకలు ఏర్పాటు చేస్తారు. ఈ ఆసుపత్రిలో హాస్పిటల్ బ్లాక్ ఒక్కటే 22.96 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మిస్తారు. అకడమిక్ బ్లాక్, పురుష, మహిళా వసతి గృహ బ్లాకులు, ధర్మశాల, మార్చురీ, యుటిలిటీ బిల్డింగ్, సెక్యూరిటీ బిల్డింగ్ మిగిలిన తొమ్మిది లక్షల నాలుగు వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. రెండు స్థాయిల బేస్‌మెంట్ పార్కింగ్‌ను 1,500 కార్ల పార్కింగ్ కు అనువుగా నిర్మించనున్నారు.
ఉస్మానియా ఆసుపత్రి సముదాయంలో 29 ప్రధాన, 12 చిన్న ఆపరేషన్ థియేటర్లు, హెలిప్యాడ్, రోబోటిక్ సర్జరీ థియేటర్లు, ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్లు, సీవేజ్ ట్రీట్మెంట్, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు నిర్మిస్తారు. అలాగే నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలు వేర్వేరుగా నిర్మించనున్నారు. రూఫ్‌టాప్ టెర్రస్ గార్డెన్లు, క్రాస్ వెంటిలేషన్ టెక్నాలజీలతో నిర్మించే ఆసుపత్రి నూతన భవనాలు సహజమైన గాలిని అందించి రోగులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించనున్నాయి.
Also Read: Hydra Av Ranganath: వాటిని మాత్రమే కూల్చుతాం.. క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్, ఇక హాయిగా నిద్రపోండి
భవన నిర్మాణ పనులకు పూజ చేసిన అనంతరం ఎంఈఐఎల్ ప్రాజెక్టుల విభాగం అధ్యక్షుడు కె. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్ణయించిన గడువులోనే పనులు పూర్తిచేస్తామన్నారు. నూతన ఆసుపత్రి భవనాల్లో సౌకర్యాలు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ధీటుగా ఉంటాయన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వసతులతో ఈ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.