Hydra Av Ranganath: హైదరాబాద్ నగరంలో చెరువుల సంరక్షణకు ‘హైడ్రా’ ను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అప్పటి నుంచి నగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తుంది. హైడ్రా ఎలాంటి నిర్మాణాలను తొలగిస్తుందో కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
‘చట్టపరంగా అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను హైడ్రా తొలగిస్తుంది. అయితే అనుమతులు లేని ఇళ్లు అంటే చాలానే ఉంటాయి. వీటిపై హైడ్రాకు ఒక క్లారిటీ ఉంది. హైడ్రా ఏర్పడిన తర్వాత చట్టపరంగా అనుమతులు లేని ఇళ్లను మాత్రమే తొలగిస్తాం. అందుకే హైడ్రా డిమోలిషన్ పాలసీ తీసుకొచ్చాం. దీని ప్రకారం హైడ్రా ఆవిర్భావం నాటికి నిర్మించిన ఇళ్లను తొలగించం. కానీ ఆ తర్వాత నిర్మిస్తే కనుక కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.
‘గతంలో చట్ట విరుద్ధంగా నిర్మించిన వాటిపై చర్యలు తీసుకోకూడదా? అంటే తీసుకోవచ్చు. కానీ సమస్యను బట్టి పాలసీని తీసుకొచ్చాం. ప్రాక్టికల్ గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో 900లకు పైగా చెరువులు ఉన్నాయి. వీటికి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ను నిర్ణయించాలి. అందుకు మాకు పూర్తి సమాచారం కావాలి. ఈ డేటా కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వారిని సంప్రదించాం. రెండు నెలల్లో డేటా ఇస్తామన్న వాళ్లు 9 నెలలకు ఇచ్చారు. దీంతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ మార్కింగ్ పై కాస్త ఆలస్యం అయింది’ అని రంగనాథ్ తెలిపారు.
Also Read: Alay Balay Program: దత్తన్న గొప్పతనం ఇదే.. అలయ్ బలయ్‌లో కవిత స్పీచ్
‘హైదరాబాద్ లో 900లకు పైగా చెరువులు ఉంటే వాటిల్లో 115 లేక్ లకు మాత్రమే మార్కింగ్ ఉంది. లేక్ ప్రొటెక్షన్ ఛైర్మన్ గా ఎఫ్టీఎల్ నిర్ణయించే అధికారం నాకు ఉంది. కానీ సరైన సమాచారం లేకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. రెవెన్యూ అధికారుల ఇచ్చిన డేటాను కూడా నేను ఒకసారి పరిశీలించి, ఏ విధంగా చేశారో తెలుసుకుంటాను. ఎన్ఆర్ఎస్ఈ డేటా మేరకు ఇప్పుడు ఎఫ్టీఎల్ పై నోటిఫికేషన్ ఇస్తాం. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఆ తర్వాత పూర్తిస్థాయి నోటిఫై ఉంటుంది’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.