Insurance Murder: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్షవాతంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని మర్డర్ చేసి.. ప్రమాదం సృష్టించిందో గ్యాంగ్. బీమా క్లెయిమ్ కోసం ఓ మహిళ నకిలీ భార్యగా నటించింది. సినిమా లెవల్ స్కెచ్ వేసి బీమా డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేశారు. అసలు భార్య ఎంట్రీతో ప్లాన్ రివర్స్ అయింది.
కర్ణాటక హోస్పేట్ శివారులో సెప్టెంబర్ 28న టీవీఎస్ XL వాహనాన్ని, గుర్తు తెలియని కారు ఢీకొనడంతో గంగాధర అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అయితే గంగాధర పక్షవాతంతో బాధపడుతున్నాడని, అతడు బండి నడిపే స్థితిలో లేడని భార్య చెప్పడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు.
హోస్పేట్‌లోని గంగావతి ప్రభుత్వ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ కృష్ణ, బ్యాంకు ఉద్యోగి యోగరాజ్ సింగ్, గోసంగి రవి, అజయ్, రియాజ్ ఓ గ్యాంగ్ గా ఏర్పడి బీమా డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. గంగాధరను పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పక్షవాతంతో బాధపడుతున్న గంగాధరకి రూ.5 కోట్ల జీవిత బీమా, రూ. 25 లక్షల ప్రమాద బీమా చేయించారు. నామినీగా హులిగెమ్మ అనే ఓ మహిళను ఒప్పించి అతడికి భార్యగా పాలసీల్లో ఎంట్రీ చేశారు.
గంగాధర ఇప్పట్లో చనిపోయేలా లేడని, బీమా డబ్బుల కోసం హత్య చేయాలని ఈ ముఠా నిర్ణయించింది. దీంతో గంగాధరను కిడ్నాప్ చేసి, హత్య చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని ఉంచి ఓ కారుతో ఢీకొట్టారు. మృతుడి భార్యకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
విజయనగర పోలీసు సూపరింటెండెంట్ జాహ్నవి మాట్లాడుతూ, “సెప్టెంబర్ 28న ఉదయం 5.30 గంటలకు హిట్ అండ్ రన్ కేసు గురించి సమాచారం వచ్చింది. సండూర్ రోడ్డులో ఒక మృతదేహం పడి ఉందని స్థానికులు సమాచారం ఇచ్చారు. మేము సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదంపై ఆరా తీశాము. మృతుడిని గుర్తించి అతని భార్య శారదమ్మను పోలీస్ స్టేషన్‌కు పిలిపించాం ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం” అని అన్నారు.
“34 ఏళ్ల గంగాధరతో తనకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగిందని, మూడేళ్ల క్రితం అతడికి పక్షవాతం వచ్చి శరీరంలోని ఎడమ వైపు పనిచేయడం లేదని శారదమ్మ ఫిర్యాదులో పేర్కొంది. గంగాధరకు బైక్ కూడా లేదు. దీంతో హిట్ అండ్ రన్ కేసుపై అనుమానం వచ్చింది” అని ఎస్పీ అన్నారు.
శారదమ్మ ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే కేసును ఛేదించామని ఎస్పీ జాహ్నవి తెలిపారు. ఆ వ్యక్తి భార్యగా నటించిన హులిగెమ్మతో సహా ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేశామన్నారు. నేరానికి ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.