మనిషికంటే ముందు అంతరిక్షంలోకి మొదటగా వెళ్లిన ప్రాణిగా లైకా అనే కుక్క రికార్డ్ సృష్టించింది. ఆ ప్రయోగాన్ని రష్యా చేపట్టింది. ఇప్పుడు చంద్రుడిపైకి కుక్కల్ని పంపిస్తోంది చైనా. అయితే ఇవి మామూలు కుక్కలు కాదు, రోబో కుక్కలు. ఇటీవల ఐపీఎల్ లో కూడా చంపక్ అనే రోబో కుక్క గ్రౌండ్ లో షికారు చేయడం అందరం చూశాం. అలాంటి రోబో కుక్కల్ని చైనా ఇప్పుడు చంద్రుడిపైకి పంపించే ప్రయత్నాల్లో ఉంది. మనిషిలాంటి రోబోలను, పురుగుల్లాంటి రోబోలను కూడా పంపించొచ్చు. కానీ నాలుగు కాళ్లతో ఎలాంటి ఉపరితలంపై అయినా సులభంగా వెళ్లగలిగే రోబో కుక్కలే దీనికి కరెక్ట్ అని చైనా శాస్త్రవేత్తలు భావించారు. అందుకే రోబో కుక్కలకు ముందస్తు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు.
పెకింగ్ యూనివర్శిటీ ప్రయోగాలు..
పెకింగ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేపట్టారు. చంద్రుని ఉపరితలంపై డేటాను సేకరించడానికి ప్రత్యేకంగా రెండు రోబోటిక్ కుక్కలను తయారు చేసినట్టు తెలిపారు. చంద్రుడిపై ఉండే ప్రత్యేక వాతావరణంలాగే ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వీటిని పరీక్షించారు. చైనాలోని ఉత్తర హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని జింగ్బో సరస్సు సమీపంలోని లావా గుహ వద్ద సరిగ్గా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయి. ఈ గుహ చల్లగా, చీకటిగా ఉంటుంది. చంద్రుడిపై ఎలాంటి వాతావరణం ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అందుకే ఇక్కడకు ఆ రోబో కుక్కల్ని తీసుకొచ్చి తర్ఫీదునిచ్చారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జింగ్బో సరస్సు వద్ద ప్రయోగాలు..
చంద్రుని ఉపరితలంపై అంగారక గ్రహంపై కూడా లావా ట్యూబ్స్ గా పిలిచే భూగర్భ సొరంగాలు ఉన్నాయి. ఇవి కాస్మిక్ కిరణాల నుండి సహజ రక్షణను అందిస్తాయి. చైనాలోని జింగ్బో సరస్సులోని సొరంగాలు కూడా సరిగ్గా ఇలాగే ఉంటాయి. అందుకే ఈ జింగ్బో సరస్సు వద్ద ప్రయోగాలు చేపట్టింది చైనా. ఈ రోబోట్ కుక్కలలో ఒకటి యాంటీటర్ ద్వారా ప్రేరణ పొంది, క్లిష్టమైన ప్రదేశాలను అన్వేషించడానికి రూపొందించారు. రెండో రోబోటిక్ డాగ్ నిఘా నేత్రంగా పనిచేస్తుంది. కఠినమైన భూభాగాలను దాటడానికి దీన్ని తయారు చేశారు. జింగ్బో సరస్సు వద్ద ఈ రోబోటిక్ కుక్కలను విడిచిపెట్టగా అవి సొంతంగా సమర్థవంతంగా నావిగేట్ చేయగలిగాయి. అందుబాటులో ఉన్న ప్రాదేశిక డేటాను సేకరించగలిగాయి. అవి కచ్చితమైన 3D నమూనాలను సృష్టించాయి.
Also Read: సముద్రంలో స్కూబా డైవింగ్.. యువకుడి ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్!
టార్గెట్ 2030
2030లోగా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించాలని చూస్తోంది చైనా. 2035 నాటికి రష్యాతోపాటు ఇతర భాగస్వామ్య దేశాల సహకారంతో అంతర్జాతీయ చంద్ర పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా భావిస్తోంది. అందులో భాగంగానే ఈ పరిశోధనలు చేపట్టింది. లాన్యుయే అనే లూనార్ ల్యాండర్ ని చైనా అభివృద్ధి చేస్తోంది. ఇటీవలే ఇది తన మొదటి టెథర్డ్ పరీక్షను పూర్తి చేసుకుంది. ఇద్దరు వ్యోమగాముల్ని చంద్రుడిపైకి తీసుకెళ్లి, తిరిగి భూమిపైకి తిరిగి రావడం లాన్యుయే లక్ష్యం. దీనికంటే ముందు చంద్రుడిపైకి రెండు రోబో కుక్కల్ని చైనా పంపించబోతోంది.