Alay Balay Program: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రతీ ఏడాది జరిగే అలయ్-బలయ్ కార్యక్రమం.. ఈసారి మరింత ప్రత్యేకంగా నిలిచింది. మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ దసరా ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయ, సినీ, సాహిత్య, సామాజిక రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.
దత్తన్నకు ఘన సత్కారం- కవిత ఆత్మీయత
ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, కల్వకుంట్ల కవితను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంలో కవిత మాట్లాడుతూ దత్తన్న వ్యక్తిత్వం, ఆయన వారసత్వం, అలయ్ బలయ్ ప్రాముఖ్యత గురించి చెప్పారు.
కవిత కామెంట్స్
కవిత మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని కొనసాగించడం గర్వకారణమని చెప్పారు. రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు.
పది మందితో ఆనందం పంచుకోవటమే పండుగ. అలాంటి ఆనందాన్ని పంచుకునే వేదికే అలయ్ బలయ్ అని కవిత వ్యాఖ్యానించారు.
దత్తన్న అంటే తమకు బీజేపీ నాయకుడు గానో, గవర్నర్ గానో గుర్తుకు రారని, కానీ పదిమందిని కలుపుకునే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగానే గుర్తుకు వస్తారని స్పష్టం చేశారు.
వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న విజయలక్ష్మి
కవిత మాట్లాడుతూ, దత్తాత్రేయ వారసత్వాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి సమర్ధంగా కొనసాగించడం హర్షణీయమని అన్నారు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా నడిపించాలని అభినందనలు తెలిపారు.
దత్తన్న మానవతా విలువలు
కవిత తన వ్యాఖ్యల్లో దత్తన్న వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా గుర్తు చేశారు. రాజకీయాల్లో నేను ఎదుగుతున్న సమయంలో.. చాలా మంది దత్తన్న గురించి చెప్పేవారు. ఎవరికైనా సమస్య ఉంటే ఆయన వద్దకు వెళితే తీర్చేవారని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేసేవారని అందరూ చెప్పేవారు. అలాంటి నాయకుడిని అందరూ అభిమానిస్తారు అని కవిత పేర్కొన్నారు.
Also Read: 12 క్వింటాళ్ల మటన్ 4000 వేల కిలోల చికెన్ దత్తన్న దసరా
అలయ్ బలయ్ – తెలంగాణ సంస్కృతి ప్రతిబింబం
ఈ కార్యక్రమం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆవిష్కరించబడింది. బోనాలు, బతుకమ్మ, గంగిరెడ్డుల ఆటలు, సాంప్రదాయ వంటకాలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించగా, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా వాతావరణం నెలకొంది.