Sethu Smart Kiosk: స్వేచ్ఛ బ్యూరో: బాధను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కే సామాన్యుడికి ఎలాంటి బెరుకు, ఆందోళన లేకుండా చూడటానికి హైదరాబాద్ సిటీ పోలీస్ వినూత్న సాంకేతిక సేవలకు శ్రీకారం చుట్టింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే అత్యాధునిక స్మార్ట్ కియోస్క్ ‘సేతు’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్రవారం మెహదీపట్నం పోలీస్ స్టేషన్ లో పైలట్ ప్రాజెక్టుగా సీపీ వీ.సీ.సజ్జనార్ దీనిని ప్రారంభించారు.
‘సేతు’ ప్రత్యేకతలు..
స్టేషన్ కు వచ్చే బాధితులు తమకు వచ్చిన భాషలోనే సమస్యను వివరించవచ్చు. కృత్రిమ మేధ సాయంతో ఈ కియోస్క్ బాధితుడి మాటలను డిజిటల్ గా నమోదు చేస్తుంది. ఫిర్యాదు అందిన వెంటనే జాప్యం లేకుండా డిజిటల్ రసీదును అందిస్తుంది. తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది బాధితునికి స్పష్టంగా వివరిస్తుంది. నమోదైన ప్రతి ఫిర్యాదుకు ఓ ప్రత్యేక డిజిటల్ ట్రాకింగ్ సదుపాయం ఉంటుంది. దీని ద్వారా సమస్య పరిష్కారమయ్యేంతవరకు దర్యాప్తు ఏ దశలో ఉందో, తీసుకున్న చర్యలేమిటో ఉన్నతాధికారులు సమీక్షించే వెసులుబాటు కలుగుతుంది.
ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత..
కియోస్క్ ను ప్రారంభించిన సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే పోలీసుల ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. బాధతో స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో, గౌరవప్రదంగా పలకరించి, పూర్తి సంతృప్తితో వెనక్కి పంపాలన్నదే మా విధానమన్నారు. పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ కౌంటర్ నుంచే పౌరులకు ఆ నమ్మకం కల్పిస్తామని చెప్పారు. ‘సేతు’ అంటే వారధి.. ప్రజలకు, పోలీసు వ్యవస్థకు మధ్య మరింత విశ్వసనీయతను పెంచే వారధిగా ఇది నిలుస్తుందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌లో ప్రారంభించిన ‘సేతు’ కియోస్క్ సేవలను ఫలితాల ఆధారంగా దశలవారీగా అన్ని పోలీస్ స్టేషన్లకూ విస్తరించనున్నట్టు వెల్లడించారు.
ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోండి..
నగర ప్రజలు ఈ ఆధునిక సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ విలువైన సలహాలు, సూచనలను అందించి పోలీసింగ్ వ్యవస్థను మరింత ప్రజాహితంగా మార్చేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (శాంతి భద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ అవినాష్ కుమార్ , గోల్కోండ జోన్ డీసీపీ రాఘవేందర్ రెడ్డి, డెవలపర్ అమిత్ సింగ్ , అడిషినల్ డీసీపీ కృష్ణ గౌడ్ , ఏసీపీ శ్రీనివాస్, సీఐ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: ORRపై ఘోర ప్రమాదం.. వ్యాన్ ఢీకొని ముగ్గురు దుర్మరణం!