Sridhar Babu: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర శాసనసభ సమావేశాలు అత్యంత ప్రజాస్వామికంగా, పారదర్శకంగా జరిగాయని పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సభలో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ సభలోని ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పించారని, అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు మాత్రం సభ కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. గడిచిన 8 రోజుల పాటు సభ సాగిన తీరును మంత్రి శ్రీధర్ బాబు గణాంకాలతో వివరించారు. సభ 8 రోజుల పాటు మొత్తం 51 గంటల 52 నిమిషాల పాటు సభ కొనసాగిందన్నారు. సభలో 4 స్వల్పకాలిక చర్చలు జరగ్గా, 4 ముసాయిదా బిల్లులను ఆమోదించుకున్నామన్నారు. 50 ప్రశ్నలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమాధానాలిచ్చిందన్నారు. 86 మంది సభ్యులు సప్లమెంటరీ ప్రశ్నలు వేయగా, మొత్తం 105 మంది శాసనసభ్యులు వివిధ ప్రజాసమస్యలపై మాట్లాడారన్నారు.
ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ సభ్యుల రభస..
సస్పెండ్ కావాలనే ముందస్తు వ్యూహంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు వచ్చారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా నినాదాలు ఉన్న నల్ల టీషర్టులు వేసుకుని రావడం, పోడియం వద్దకు వెళ్లి అడ్డంకులు సృష్టించడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. శాసనసభ రూల్స్ కమిటీ రూపొందించిన నిబంధనల ప్రకారమే స్పీకర్ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు.సమావేశాల మొదటి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, స్పీకర్‌ను అనుచిత పదజాలంతో దూషించడం, మహిళా పోలీసులతో ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ అని వాపోయారు. స్పీకర్ మనస్తాపం చెందినప్పటికీ సభను హుందాగా నడిపారని ధన్యవాదాలు తెలిపారు.
మాక్ అసెంబ్లీతో సభా గౌరవానికి భంగం..
శాసనసభను కాదని బయట ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించడం హాస్యస్పదమని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించిన బీఆర్ఎస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను విప్‌లు కోరినట్లు వెల్లడించారు. “రెండు నెలలు సభ నడపాలని డిమాండ్ చేసిన కేటీఆర్, కనీసం తమపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం” అని మంత్రి పేర్కొన్నారు.
22-ఏ భూములపై స్పష్టమైన హామీ..
22-ఏ నిషేధిత భూముల అంశంపై ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలోనే సమగ్ర సమాధానం ఇచ్చారని తెలిపారు. ప్రజలను అయోమయంలో ఉంచవద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు వచ్చి చర్చ చేపట్టిందన్నారు. సమస్యల పరిష్కారానికి ‘హైపవర్ ఆఫీషియల్ కమిటీ’ని ఏర్పాటు చేశామని, కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఎల్ నినో ప్రభావంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సభలో చర్చించి ప్రజల్లో అవగాహన కల్పించారన్నారు. ప్రజాస్వామిక వాతావరణంలో బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెబుతూ, బీఆర్ఎస్ వైఖరి మారి ప్రజలకు ఉపయోగపడేలా వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు.
Also Read: పోలీస్ స్టేషన్‌లో సరికొత్త విప్లవం.. ఇకపై ఏ భాషలోనైనా ఫిర్యాదు చేయొచ్చు!