Haribabu Murder: యూట్యూబర్ వైష్ణవి మరణానికి కారణమైన ఆమె భర్త హరిబాబును.. బాధితురాలి సోదరుడు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ లోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద వైష్ణవి సోదరుడు సంతోష్.. పదునైన ఆయుధంతో పలుమార్లు హరిబాబుపై దాడి హత్య చేశారు. ఆపై తానే చంపినట్లు ధ్రువీకరిస్తూ.. సెల్ఫీ వీడియోను సైతం విడుదల చేశారు. పోలీసులకు లొంగిపోతున్నాని, ప్రజల మద్దతు కావాలని కోరారు. ఇదిలా ఉంటే హరిబాబు హత్య నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. హరిబాబు హత్య జరిగేలా యాంకరే పురిగొల్పిందన్న అభిప్రాయాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకు వైష్ణవి 13 సోదరుల్లో ఒకరు (హత్య చేసిన వ్యక్తి కాదు) ఇటీవల హాజరయ్యారు. అందులో మహిళా యాంకర్ వైష్ణవి హత్య గురించి మాట్లాడుతూ.. హరిబాబు బెయిల్ పై బయటకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తమ చెల్లికి న్యాయం జరిగేవరకూ వదిలిపెట్టేదని లేదని గతంలో సోదరులు చేసిన ప్రతిజ్ఞను ఈ సందర్భంగా యాంకర్ గుర్తుచేశారు. ‘మరి ఏం సైలెంట్ అయిపోయారా? వదిలేశారా? పట్టించుకోవడం లేదా? న్యాయం జరిగిందని మీరు ఫీలవుతున్నారా?’ అని వైష్ణవి సోదరుడికి వరుస ప్రశ్నలను లేడీ యాంకర్ సంధించారు. అప్పుడు అతడు బదులిస్తూ ‘చంపుడు పెద్ద విషయం కాదు. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు’ అని వ్యాఖ్యానించారు.
ఇక్కడే యాంకర్ వేసిన ప్రశ్నలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. ‘ఇంతమంది అన్నాదమ్ముళ్లు ఉన్నారు మీ చెల్లికి ఏం న్యాయం చేసినట్లు. అప్పట్లో మీ చెల్లి గురించి ఏడ్చారు, వీడియోలు పెట్టారు, పెద్ద గొడవలే చేశారు. మళ్లీ అందరూ మీ నార్మల్ లైఫ్ చూసుకుంటున్నారు. మరి వైష్ణవికి న్యాయం జరిగిందా ఎక్కడైనా?’ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. అప్పుడు వైష్ణవి సోదరుడు చాలా బాధగా న్యాయం ఏం జరగలేదని సమాధానం ఇచ్చారు. దీనిపై లేడీ యాంకర్ మాట్లాడుతూ.. ‘అప్పుడు మీ అన్నదమ్ముళ్లు ఏం చేయగలిగినట్లు? ఏం చేయలేని పరిస్థితా? వాళ్లకి అంత పవర్ ఉందా? ఒక మనిషిని చంపి కూడా ఆయన (హరిబాబు) బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడంటే ఎవరి లోపం ఇదంతా?’ అని వరుస ప్రశ్నలు సంధించారు.
ఈ ఇంటర్వ్యూ తర్వాత హరిబాబు హత్య జరిగిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన క్లిప్ ను పలువురు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రశాంతంగా ఎవరి బతుకు వారు బతుకున్న సోదరులను ఈ యాంకర్ తన ప్రశ్నలతో రెచ్చగొట్టిందని ఆరోపిస్తున్నారు. ‘యాంకర్ ను అరెస్టు చేయాలి. పరోక్షంగా చంపు అని రెచ్చగొట్టింది’ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. హంతకుడైన వైష్ణవి సోదరుడు సంతోష్ కు భార్య, పిల్లలు ఉన్నారని, ఇప్పుడు వారి పరిస్థితేంటని నిలదీస్తున్నారు. మెుత్తం మీద యాంకర్ హత్యకు పురిగొల్పిందా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే.. ఈ ఇంటర్వ్యూ క్లిప్ మాత్రం నెట్టింట ఒక తీవ్ర దుమారాన్నే రేపుతోందని చెప్పవచ్చు.
Interview Clip Link: https://www.threads.com/share/BAR8YNrtvY/
Also Read: పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!