BRS Leaders: గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది..? ఒకప్పుడు జిల్లా పర్యటనకు కవిత వస్తున్నారంటేనే ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఎందుకు ముఖం చాటేస్తున్నారు..? కవిత పర్యటనల్లో పాల్గొంటే అధిష్టానం సీరియస్ అవుతుందన్న భయమా లేదంటే మరేదైనా కారణం ఉందా..? ఓవైపు కారు పార్టీ ఎమ్మెల్సీగా కవిత కొనసాగుతున్నా.. గులాబీ నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరించడం వెనుక మతలబేమైనా ఉందా..? అసలేంటి మ్యాటర్..?
కవిత విషయంలో బీఆర్ఎస్ విషయంలో నేతల్లో డైలమా
ఒక్క లేఖ.. ఒకే ఒక్క లేఖతో బీఆర్ఎస్‌లో పరిస్థితి అంతా మారిపోయిందట. అప్పటి నుంచి మొదలైన కాక రోజురోజుకూ పెరిగి పెద్దదవుతూ అనేక పరిణామాలకు దారి తీస్తోందట. అసలు లేఖ ఏంటి.. బీఆర్ఎస్‌లో అది పుట్టిస్తున్న కాక ఏంటన్నది చూసేముందు ప్రస్తుతం గులాబీ పార్టీలో నెలకొన్న పరిస్థితిని ఓసారి గమనిస్తే.. ఎమ్మెల్సీ కవిత విషయంలో బీఆర్ఎస్ నేతల్లో హైడ్రామా నెలకొందట. ఇంకా చెప్పాలంటే అధినేత కేసీఆర్ గారాలపట్టి అయిన కవిత పర్యటనల్లో పాల్గొంటే.. పరిస్థితి ఎటుపోయి ఎటు వస్తుందోనన్న భయం నెలకొందట.
గతంలో కవిత వస్తున్నారంటేనే నేతల్లో ఎంతో హడావిడి
నిజానికి బీఆర్ఎస్‌లో వివిధ పదవులు నిర్వహించారు కవిత. ప్రస్తుతం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే.. గతంలో ఎప్పుడైనా కవిత జిల్లా పర్యటనకు వస్తున్నారంటే చాలు గులాబీ పార్టీ నేతలు చేసే హడావిడి అంతా ఇంతా ఉండేది కాదనే చెప్పాలి. దగ్గరుండి స్వాగతం చెప్పడం మొదలు ఆమె నోటి నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయని ఎదురు చూసేవారట గులాబీ నేతలు.
ఎదురెళ్లి మరీ స్వాగతాలు పలికేవారు
ఎంతో మంది కారు పార్టీ నేతలు కవిత చుట్టూ చక్కర్లు కొడుతుండే వారు. ఆమె దృష్టిలో పడేందుకు ప్రయత్నించేవాళ్లు. ఇంకా చెప్పాలంటే కవిత ఒక్క మాట చెప్పారంటే చాలు అధినేత కేసీఆర్ వద్ద అభయం లభించినట్లేనన్న టాక్ సైతం గతంలో విన్పించింది. ఆ క్రమంలోనే పలువురు పెద్ద నేతలు పదవులు పొందారు. ఇక చోటా మోటా పదవులైతే లెక్కేలేదు.
గతంలో పరిస్థితికి.. ఇప్పటికీ ఎంతో తేడా
కానీ, ఇప్పుడు మాత్రం సీన్ మారిందనే టాక్ పార్టీలోనే విన్పిస్తోందట. ఎమ్మెల్సీ కవిత చేపడుతున్న కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు మినహాయిస్తే పేరున్న నేతలు ఎవరూ పెద్దగా పాల్గొనడం లేదన్న టాక్ కేడర్ నుంచే విన్పిస్తోంది. అంతేకాదు.. ఇదంతా గమనించిన కవిత పార్టీ నాయకులతోనే ఈ విషయం అన్నారట.
కవిత లేఖ వ్యవహారంతో మారిన సీన్
అయితే.. ఇక్కడే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కవితతో కలిసి నడిచేందుకు పోటీ పడిన నేతలు ఎందుకు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు..? ఆమె పాల్గొన్న కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు పోటీ పడిన వారు ఇప్పుడు ఎందుకు పక్కకు తప్పుకుంటున్నారు అంటే.. విన్పించే మాట.. ఒక్క లేఖ.
తాను రాసిన లేఖ ఎలా లీకేందన్న కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లడం.. అనంతర పరిణామాలపై పార్టీ అధినేత కేసీఆర్‌కు కొన్ని రోజుల క్రితం ఓ లేఖ రాశారు కవిత. అయితే.. ఆ లేఖ లీక్ కావడం బీఆర్ఎస్‌లో ప్రకంపనలు పుట్టించింది. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తనకు ఎదురైన అనుభవాలు.. ఇలా పలు అంశాలపై తన అభిప్రాయన్ని… తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు లెటర్ రూపంలో రాశారు ఎమ్మెల్సీ కవిత. అలాంటి లెటర్ ఎలా లీక్ అయిందన్నది ఆమె ప్రధాన ప్రశ్న. దీనిపైనే అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రశ్నాస్త్రాలు సంధించారు కవిత. తనలాంటి వ్యక్తి రాసిన లెటరే లీకైతే.. ఇక మిగిలిన నేతలు, కార్యకర్తల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారామె.
కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కవిత కామెంట్స్
ఇక్కడితే ఆగలేదు ఎమ్మెల్సీ కవిత. గులాబీ బాస్ కేసీఆర్ దేవుడే కానీ, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఆరోపించారామె. వాళ్ల వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని మండిపడ్డారు. కవిత చేసిన ఈ కామెంట్లు బీఆర్ఎస్‌లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి.
కవిత వ్యాఖ్యలపై రియాక్టైన కేటీఆర్
కవిత లేఖ కాక పుట్టించడంతో పార్టీ తరఫున స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్. పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విషయాలను ఇంటర్నల్‌గా మాట్లాడితేనే మంచిదని అభిప్రాయపడ్డారు. ఏ స్థాయిలో ఉన్న నేతలైనా బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు కేటీఆర్.
కవిత పార్టీ అగ్రనేలకు మధ్య పెరిగిన దూరం
కవిత కామెంట్లకు, కేటీఆర్ కౌంటర్ సంగతి ఎలా ఉన్నా.. ఒక విషయంపై మాత్రం విస్తృతంగా చర్చ జరిగింది. అదే.. ఎమ్మెల్సీ కవిత ఆరోపించినట్లుగా కేసీఆర్ దేవుడు అయితే.. మరి దెయ్యాలు ఎవరు అన్నది తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శల బాణాలు ఎక్కు పెట్టడంతో బీఆర్ఎస్ ఇంటర్నల్ పాలిటిక్స్ కాస్తా రాష్ట్ర పాలిటిక్స్‌గా మారిన పరిస్థితి నెలకొంది.
ఎందుకొచ్చిన తంటా అంటూ మొఖం చాటేస్తున్న నాయకులు
ఇక, అప్పటి వరకు ఇంటర్నల్‌గా సాగిన విభేదాలు కవిత లేఖ లీక్ వ్యవహారం నుంచి రచ్చకెక్కాయి. దీనికి కేటీఆర్ కామెంట్లు జతకావడంతో పార్టీకి చెందిన సీనియర్లు, బడా నాయకులు ఎందుకొచ్చిన తంటా అని మౌనం వహించారట. దీనికి తోడు పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నా కవిత మాత్రం జాగృతి తరఫున తన కార్యక్రమాలు చేపడుతూ పోతున్నారు. జాగృతిలోకి వచ్చిన వారికి కండువాలు కప్పడంతోపాటు తాను స్వయంగా బీసీ రిజర్వేషన్లు, బనకచర్ల వివాదం సహా మరికొన్ని అంశాలు ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇప్పటికైనా పరిస్థితిలో మార్పు వస్తుందా?
ఓవైపు కేటీఆర్, హరీశ్‌రావు సహా ఇతర నేతలు అన్నట్లుగా ఉంటే.. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఒక్కరే కన్పిస్తున్నారు. దీంతో.. ఎటు వైపు ఉండాలో తేల్చుకోలేక పోతున్నారట గులాబీ సీనియర్ నేతలు. దీంతో.. ఇప్పటికైనా పరిస్థితిలో మార్పు వస్తుందా లేదంటే ఇంకా తమకు ఇబ్బందులు తప్పవా అని లోలోన గుబులు చెందుతున్నారట.
Story By rajashekar, Bigtv Live