Hydra Commissioner: ఒక కాలనీ వాసుల హృదయాల్లో నమ్మకం నింపగలిగే పని చేస్తే, ఆ కృతజ్ఞతలు అస్సలు తగ్గవు. కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం సర్కిల్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్ వాసులు ఇప్పుడు ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే, వారు ఏళ్లుగా భయపడుతున్న ఒక పెద్ద సమస్యను హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (హైడ్రా) ఒక్కసారిగా పరిష్కరించింది.
ఏం జరిగిందో తెలుసా?
ఈ కాలనీలో ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 3,500 గజాల స్థలం ప్రజావసరాల కోసం కేటాయించబడింది. ఈ స్థలం మీద కాలనీకి పార్క్‌లు, కమ్యూనిటీ హాల్, ఇతర సౌకర్యాలు రావాలని ప్రజలు కలలు కన్నారు. కానీ వాస్తవం వేరేలా మారింది. ఏకంగా వెయ్యి గజాలకు పైగా ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు మొదలుపెట్టారు. కాలనీ ప్రజలు ఎన్నిసార్లు ఆపమన్నా, కబ్జాదారులు వెనక్కి తగ్గలేదు.
అప్పుడు ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఈ విషయం హైడ్రా అధికారుల దృష్టికి వచ్చింది. కమీషనర్ ఏ.వి. రంగనాథ్ ఈ ఫిర్యాదును వెంటనే సీరియస్‌గా తీసుకున్నారు. ఫీల్డ్ సిబ్బందిని పంపించి, మొత్తం స్థితిగతులు పరిశీలించారు. దర్యాప్తులో నిజంగానే ప్రజావసరాల స్థలం మీద అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది.
తర్వాత ఏమైందంటే..
హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. ఇటీవల ఏర్పడిన కొత్త నిర్మాణాలు ఒక్కటి మినహా లేకుండా కూల్చివేయబడ్డాయి. ఆక్రమిత స్థలం ఖాళీ చేయబడింది. కాలనీ వాసులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న దృశ్యం ఆ రోజు ప్రత్యక్షమైంది. అందరూ ఒకే సారి ఊపిరి పీల్చుకున్నారు.
అంతటితో ఆగకుండా, హైడ్రా ఖాళీ అయిన 3,500 గజాల స్థలం చుట్టూ బలమైన ఫెన్సింగ్ వేసింది. దీని వల్ల మళ్లీ ఎవరూ అక్రమంగా చొరబడే అవకాశం లేకుండా పోయింది. ఈ స్థలం ఇప్పుడు భగత్‌సింగ్ నగర్ కాలనీవాసుల భవిష్యత్తు సౌకర్యాలకు బలమైన పునాది అయింది.
Also Read: Thief viral video: తాళం బ్రేక్ కాదు.. జస్ట్ ఇలా ఓపెన్! దొంగ ‘పెట్రోల్ ట్రిక్’తో పోలీసులు కూడా షాక్!
ఈ విజయాన్ని జరుపుకోవడానికి, వందలాదిగా కాలనీవాసులు హైడ్రా కమిషనర్ కార్యాలయానికి తరలి వచ్చారు. మీరు మా కోసం చేసిన ఈ పని మా పిల్లలకు భవిష్యత్తులో సదుపాయాలు అందేలా చేస్తుందని చెబుతూ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ను పూలమాలలతో సత్కరించారు. ఆక్రమణలు తొలగించడంలో కష్టపడ్డ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
కాలనీ పెద్దలు చెబుతున్న మాటలు..
హైడ్రా రంగంలోకి దిగకపోతే, ఈ స్థలం పూర్తిగా కబ్జాలపాలయ్యేది. ఇప్పుడే ఈ చర్య తీసుకోవడం వల్ల మేము రాబోయే తరాల కోసం ఈ భూమిని కాపాడగలిగామన్నారు. ఈ 3,500 గజాల స్థలాన్ని శాశ్వతంగా రక్షించేలా పక్కా ఫెన్సింగ్ వేసి, తాళాలు వేసి ఉంచాలి. అలాగే త్వరలోనే ప్రజావసరాల కోసం ప్రణాళికలు రూపొందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
ప్రజావాణి వంటి వేదికల ద్వారా సాధారణ ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లగలరనే ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది. ఆక్రమణలతో ఇబ్బందిపడుతున్న ఇతర కాలనీలకు ఇది ఒక ప్రేరణ. హైడ్రా చేసిన ఈ పని ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు.. ఒక సమాజానికి, ఒక కాలనీకి భవిష్యత్తు బాటలు వేసిన గొప్ప చర్య. అందుకే ఇప్పుడు భగత్‌సింగ్ నగర్‌లో ఒకే మాట వినిపిస్తోంది.. హైడ్రా జిందాబాద్ అని!