“కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి..” ప్రెస్ మీట్ లో కేటీఆర్ డిమాండ్ ఇది.
“రేవంత్ రెడ్డి ఐదేళ్లూ సీఎంగా ఉండాలి, అప్పుడే మాకు ఉపయోగం.” అదే ప్రెస్ మీట్ లో కేటీఆర్ మరో వెర్షన్.
అసలు కేటీఆర్ కి ఏం కావాలి..? రేవంత్ రెడ్డి ఐదేళ్లు పదవిలో ఉండాలంటారు, అదే నోటితో ఆయన రాజీనామా చేయాలంటారు. అధికారానికి దూరమైన ఏడాదిన్నరలోనే చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు కేటీఆర్. అసలు ఆయనకు ఏం కావాలి, అధికారమా..? లేక ఇంకేదైనానా..? కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పర్లేదు, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం సీఎం సీటు వద్దన్నట్టుగా ఉంది కేటీఆర్ పరిస్థితి అంటూ.. నెటిజన్లు కౌంటర్లిస్తున్నారు.
రేవంత్ రెడ్డి పేరు చెబితేనే..
సీఎం రేవంత్ రెడ్డి పేరు చెబితే బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్ లో తీవ్ర అలజడి మొదలవుతోంది. దాని పర్యవసానమే ప్రెస్ మీట్లలో ఆయన చేస్తున్న అసంబద్ధ వ్యాఖ్యానాలు. అసలు సుప్రీంకోర్టు తీర్పుతో ఎక్కడైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా..? ఆ మాటకొస్తే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ హైకోర్టు ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అప్పుడు కేసీఆర్ రాజీనామా చేశారా..? న్యాయపోరాటంలో ఇప్పుడు జరిగింది ఒక ఎపిసోడ్ మాత్రమే. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు తుదితీర్పు ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం కొన్ని ఆదేశాలు మాత్రమే ఇచ్చింది. బాధ్యతగల ప్రభుత్వం వాటిని కచ్చితంగా పాటిస్తుంది. అంత మాత్రాన సీఎం రాజీనామా చేయాలి..? తెలంగాణలో ఏదో జరిగిపోతోందంటూ కేటీఆర్ హడావిడి చేయడం ఇక్కడ విశేషం.
LIVE : BRS Working President @KTRBRS addressing the media at Telangana Bhavan https://t.co/Tf71XWYjnW
— BRS Party (@BRSparty) April 17, 2025
కాంగ్రెస్ పై కుట్రలు..
ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు రకరకాల కుట్రలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇటీవల ఆ పార్టీ నేతల మాటలే ఆ కుట్రలను తేటతెల్లం చేశాయి. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండాలని, సీఎంగా రేవంత్ రెడ్డి ఉండాలంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు కేసీఆర్, కేటీఆర్. తాజాగా కేటీఆర్ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలని, అప్పుడే తమకు కలిసొస్తుందని, మరో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని అంటున్నారాయన. అదే రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని మాత్రం కేటీఆర్ మరచిపోయినట్టున్నారని కాంగ్రెస్ కౌంటర్లిస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్న వారంతా ఈసారి అధికారం మాదేనని అనుకుంటారు. కానీ అన్నిసార్లూ అది సాధ్యం కాకపోవచ్చు. కాంగ్రెస్ కి ప్రజలు ఇచ్చింది ఒక్క ఛాన్సేనని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పనితీరు నచ్చితే ప్రజలు కచ్చితంగా మళ్లీ కాంగ్రెస్ కే పట్టంకడతారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేడు ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడానికి కారణం కూడా ప్రజలే. ఆ విషయం మరచిపోయి తిరిగి అధికారం తమదేనని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ఏడాదిన్నరగా అధికారానికి దూరమైన కేటీఆర్ లో రోజు రోజుకీ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని విమర్శిస్తున్నారు.