CP Sajjanar: నిర్లక్ష్యం.. అలసత్వం.. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లోనే ఉంచి స్టేషన్‌లకు రావాలన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఇకపై విధుల్లో ఏ మాత్రం లేజీగా ఉన్నా అస్సలు బాగోదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ సజ్జనార్ ఎందుకు ఇంతలా సీరియస్ అయ్యారు? దానికి కారణమేంటి?
పోలీస్ వ్యవస్థకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. నేరాలను అడ్డుకోవడంలో అలసత్వం .. బేసిక్ పోలీసింగ్‌ను మర్చిపోవడం.. ఇలాంటివి ఇక కనిపించకూడదు.. వినిపించకూడదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్. విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్‌ను మరిచినా.. కోర్ పోలిసింగ్‌ను సమర్థవంతగా నిర్వర్తించకపోయినా.. నేరాలు పెరిగిపోతాయనని.. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్.
SHOలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సజ్జనార్
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు.. కొన్ని కేసుల్లో అధికారులు చూపించిన నిర్లక్ష్యం కారణంగానే సజ్జనార్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు తన దృష్టికి వచ్చాయని.. ఆయా కేసులను మళ్లీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అంతేకాదు పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలంటూ సూచించారు. అంతేకాదు ఈ మీటింగ్‌లో SHOలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సజ్జనార్. తమ పరిధిలో జరిగే విషయాలకు SHOలదే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు సజ్జనార్.
నేరం చిన్నదైనా.. పెద్దదైనా సమగ్రంగా దర్యాప్తు
కేసులను లైట్ తీసుకోవడం అనేది పోలీసుల డైరీలో ఉండకూడదన్నారు సీపీ సజ్జనార్. నేరం చిన్నదైనా.. పెద్దదైనా సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిందేనని తెలిపారు సజ్జనార్. దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్ పోలీసులకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందని.. దానిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు సజ్జనార్.
కొందరు నేతలకు వత్తాసు పలికిన ఖాకీలు
సజ్జనార్ ఇంత సీరియస్‌గా పోలీసులకు క్లాస్ తీసుకోవడం వెనక పెద్ద కారణమే ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో కొందరు పోలీసులు.. కొందరు నేతలకు వత్తాసు పలకడం.. నిందితుల విషయంలో అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే
టాస్క్‌ఫోర్స్ అధికారులపై అనేక అవినీతి ఆరోపణలు
అంతేకాదు టాస్క్‌ఫోర్స్ విభాగంలో కూడా కొన్ని మార్పులు తప్పవని తెలుస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంటే ఎంతో నమ్మకం ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా వారిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో అయితే అప్పటి అధికార పార్టీకి కొమ్ము కాశారనే ఆరోపణలపై ఏకంగా టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులపై కేసులు నమోదవ్వడమే గాకుండా.. వారిపై విచారణ జరుగుతోంది. లెటెస్ట్‌గా నిందితులకు సహకరించి.. పారిపోయేందుకు కారణమైన టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్ చేశారు. ఇలా పోలీసుల్లో అక్కడక్కడ కనిపిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వం, అవినీతి మరకలను పూర్తిగా తుడిచివేసేందుకు ఇప్పుడు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది.