Telangana Politics: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన సీట్ కోసం బీజేపీ అభ్యర్థి మీరా గంగారెడ్డిని సమర్థించడానికి కిషన్ రెడ్డి ఈ రోజు ప్రచారం చేశారు.
కార్యక్రమంలో కిషన్ రెడ్డి తీవ్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రెచ్చిపోయారు.. ముఖ్యంగా మతపరమైన వివక్షపై దృష్టి సారించారు. “ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ‘ఇజ్జత్’ అంటావు, మరి హిందువులు ఇజ్జత్ కాదా మిస్టర్ రేవంత్ రెడ్డి?” అని ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ఖబర్‌స్తాన్‌కు స్థలం కేటాయించడం సరైనదేనా, కానీ బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాల స్థలం ఇవ్వలేకపోవడం ఎందుకు? అని ఆరోపించారు. హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ అనుబంధాన్ని ఎంతకాలం కొనసాగిస్తారో అని సవాలు విసిరారు. “ప్రజలే నీకు గట్టి బుద్ధి చెబుతారు” అని హెచ్చరించారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద కూడా తీవ్రంగా విమర్శించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం తనలో తను పరిశోధన చేయకుండా బీజేపీపై ఆరోపణలు చేస్తోందని, బీఆర్ఎస్‌తో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై సీబీఐ కేసు నమోదు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చాలెంజ్‌పై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. దీనిపై కేంద్రం దర్యాప్తుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బీఆర్ఎస్ పాలిటిక్స్‌లో దుర్వినియోగాలు జరిగాయని, కాంగ్రెస్ కూడా అదే మార్గంలో నడుస్తోందని ఆరోపించారు.
Also Read: రూ. 5 వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీలు బంద్..!
జూబ్లీహిల్స్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరలేదని, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఇంకా ఉన్నాయని చెప్పారు. కేంద్ర పథకాలు – రైస్ స్కీమ్, ఇందిరమ్మ ఇళ్లు – రాష్ట్ర ప్రభుత్వం తనవిగా చెప్పుకుంటోందని విమర్శించారు. రైస్ స్కీమ్‌లో కేంద్రం కేజీకి రూ.42 ఇస్తోంది, రాష్ట్రం రూ.15 మాత్రమే అందిస్తున్నా క్రెడిట్ తీసుకుంటోందని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తున్నారని, ఎక్స్‌ప్రెస్ రహదారులు, మెట్రో రైలు విస్తరణకు కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా బీజేపీ ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు తెలంగాణలో మార్పు తీసుకువస్తుందని ముగించారు.