KTR on Police: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర పోలీసులవైపు రూటు మారాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మళ్లీ తన శైలిలో పోలీసులపై గట్టి వ్యాఖ్యలు చేశారు. అధికారంలో లేని సమయంలో కూడా తన గొంతును నిలబెట్టుకున్న కేటీఆర్, ఈసారి పోలీసు వ్యవస్థ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రిగా పనిచేసిన మా సబితమ్మ మీదకే ఎగిరి ఎగిరి మాట్లాడురు అంటూ పోలీసులు ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఇది ఏ రాజకీయ నాయకుడిపై కాదని, గతంలో హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిపై చూపించిన విధ్వంసకర వైఖరిని ప్రశ్నించారు. పోలీసులు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారనే ప్రశ్న ఆయన లేవనెత్తారు. పోలీస్ అధికారుల అహంకారాన్ని కేటీఆర్ సూటిగా టార్గెట్ చేశారు. ‘‘ఇంతింత స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు ఇలా రెచ్చిపోతే, రేపటి రోజున అధికారం మారినప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయో వారికి తెలుసు’’ అని హెచ్చరించారు.
ఇక్కడితో ఆగకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా విమర్శించారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారు, ప్రజల కోసం పనిచేయాల్సినవారు, తాము ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ వ్యవస్థకు అడ్డుపడుతూ, సొంత రాజకీయ అవసరాల కోసం అబద్ధాల విందు పెడుతున్నారు అని ఆరోపించారు. “ఒక పదవిలో ఉన్నారు కాబట్టి నిజాయితీగా ఉండాలి. కానీ ఈ అధికారులు కొంతమంది కాంగ్రెస్ నాయకుల్లా మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడం.” అంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
అంతటితో ఆగకుండా, కేటీఆర్ ఒక పెద్ద హెచ్చరికను కూడా అధికార వ్యవస్థకు వదిలారు. “ఇప్పుడు మేము అధికారంలో లేము. మీరు ఎలాగైనా మీ స్వార్థం తీర్చుకుంటారు. కానీ మూడేళ్లలో మేము తిరిగి వస్తాం. మీరు చేసిన తప్పులన్నింటికి లెక్క తప్పకుండా తీర్చుకుంటాం. మీరు ఎంత అతి చేస్తే, అప్పుడు అంత కఠినంగా ఎదుర్కొంటారు” అని స్పష్టం చేశారు. ఈ మాటల్లో కేటీఆర్ ధీమా, ఆవేశం రెండూ కనిపించాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకే కొన్ని దాడులు జరుగుతున్నాయని, పోలీసులూ, ఇతర అధికారులు కూడా కాంగ్రెస్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. “ఇది కేవలం పాలన కాదు, ఇది రాజకీయ వ్యతిరేకతల పతాక స్వరూపం,” అని అన్నారు.
ఒకవైపు ప్రభుత్వం మారింది, కానీ అధికారుల ప్రవర్తన మాత్రం రాజకీయాలను చూస్తూ మారుతుండడం వల్ల, వ్యవస్థపైనే నమ్మకం పోతుందని ప్రజలే చెబుతున్నారు. ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం ఎలా పని చేసిందో, ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అన్నదాని పైనే ఇప్పుడు ఈ చర్చ తిరుగుతోంది. కేటీఆర్ మాటల్లో ఇది స్పష్టంగా వినిపించింది. “మీరు ఎవరికి పనికొచ్చారో వాళ్లకే సేవ చేస్తున్నారా? లేక ప్రజలకోసం పనిచేస్తున్నారా?” అనే ప్రశ్నలు ఆయన అధికారులు, పోలీసులకు సూటిగా ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.