Amaravati: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది కూటమి సర్కార్. వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 చేసింది. కేవలం నియోజకవర్గాల ప్రాతిపదికన ఆయా జిల్లాలను ఏర్పాటు చేసింది. దానివల్ల చాలామంది ప్రజలు పలు రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రాలకు వెళ్లాలన్నా వంద కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాటిని సరిచేసే పనిలో పడింది కూటమి సర్కార్. కేవలం పాలనా సౌలభ్యం కోసం చిరకాల డిమాండ్ల పరిశీలన చేసింది.
ఏపీలో కొత్త జిల్లాల ఎంపిక మళ్లీ మొదటికి
తొలుత ఆరు కొత్త జిల్లాలు రావచ్చని భావించారు. ఈలోగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో కేవలం రెండు జిల్లాలు వరకు వచ్చింది. కాకపోతే కొన్ని మండలాలు, జిల్లాల పేర్లు మార్పులు, కొత్తగా డివిజన్లు రానున్నాయి. కొత్తగా మదనపల్లె, మార్కాపురం జిల్లాలు అవతరించనున్నాయి.
ఇక డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు ఉండనున్నాయి. అయితే కందుకూరు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి రానుంది. బుధవారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఉపసంఘం రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన అనేక ప్రతిపాదనలపై చర్చ జరిగింది. డివిజన్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం కానున్నారు మంత్రులు.
మదనపల్లె-మార్కాపూర్ కొత్త జిల్లాలు?
ఇప్పటి వరకు వచ్చిన ప్రతిపాదనలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లతో మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఆ జిల్లాలో మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇక మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు రెవెన్యూ డివిజన్లతో మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది. కొత్తగా గిద్దలూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఒకప్పుడు కందుకూరు డివిజన్ ప్రకాశం జిల్లాలో ఉండేది. అయితే దాన్ని నెల్లూరులో కలిపారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం కందుకూరు డివిజన్‌లోని ఐదు మండలాలను ప్రకాశం జిల్లాలో కలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 77 రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి. వీటికితోడు కొత్తగా ఆరు లేదా ఏడు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.
ALSO READ: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి, ఏపీకి వచ్చేవి అవే
వాటిలో నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లి, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు వంటి ప్రాంతాలున్నట్లు తెలుస్తోంది. నక్కపల్లి మండలం నర్సీపట్నం డివిజన్‌లో ఉంది. నక్కపల్లి డివిజన్‌ను ఏర్పాటు చేస్తారా? పాయకరావుపేట డివిజన్ ఏర్పాటు చేసి అందులో కలుపుతారా? అనేది స్పష్టత రావాలి. ఈ డివిజన్‌లో యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, రాయవరం మండలాలు ఉండాలన్నది ప్రతిపాదన మాత్రమే.
ప్రస్తుతం అద్దంకి.. బాపట్ల జిల్లాలో ఉంది. రెవెన్యూ డివిజన్‌గా మార్చి ప్రకాశం జిల్లాలో కలపాలన్నది ఆ జిల్లా మంత్రి మాట. ఇక ఒంగోలు, కనిగిరి డివిజన్‌లలో మర్రిపూడి, పొన్నలూరు, కొండపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, టంగుటూరు మండలాలను కందుకూరులో విలీనం చేయాలన్నది ప్రతిపాదన. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం, చింతూరు డివిజన్‌లను తిరిగి తూర్పు గోదావరిలో కలపాలని ప్రతిపాదన చేశారు.
కోనసీమలోని రాయవరం, కపిలేశ్వరపురం, మండపేట మండలాలను రాజమండ్రి డివిజన్‌లో చేర్చాలని ప్రతిపాదన. కాకినాడ డివిజన్‌లో ఉన్న సామర్లకోటను తిరిగి పెద్దాపురం డివిజన్ పరిధిలోకి రానుంది. ఇవికాకుండా నియోజకవర్గాల్లోని పలు మండలాలను కొత్త గా ఏర్పాటు చేయబోయే డివిజన్లలో కలిపే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో ఓకే చేయాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన. వచ్చేఏడాది రిపబ్లిక్ రోజు అందుబాటులోకి కొత్త జిల్లాలు రానున్నాయి.