Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్ట్ సిరీస్ మ్యాచ్ ల్లో రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తన కాలుకి గాయం కారణంగా 5వ టెస్ట్ మ్యాచ్ కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రిషబ్ పంత్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. మానవత్వం ప్రదర్శించడంలోనూ అంతే దూకుడుగా ఉంటాడు. ఇటీవల ఇంగ్లాండ్ గడ్డ పై పాదం ఫ్రాక్షర్ అయినా బరిలోకి దిగి యావత్ క్రికెట్ ప్రపంచంచే జేజేలు పలికించుకున్న పంత్.. తాజాగా ఓ చర్య ద్వారా గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నాడు.
Also Read : Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!
“నీ కలలు నిజం అవ్వాలి” అంటూ
కర్ణాటక రాష్ట్రం బాగల్ కోట్ జిల్లాలోని రబ్కని గ్రామానికి చెందిన జ్యోతి కనబుర్ మఠ్ అనే విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం చేసి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. జ్యోతి 12వ తరగతిలో 85 శాతం మార్కులు సాధించింది. బీసీఏ చదవాలన్న ఆశతో ఉన్న ఆమెకు రూ.40వేలు ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. తండ్రి టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో.. రిషబ్ పంత్ స్పందించి కాలేజీకి ఆన్ లైన్ ద్వారా ఫీజు చెల్లించాడు. ” నీ కలలు నిజం అవ్వాలి” అంటూ ఆమెకు భరోసా ఇచ్చాడు. పంత్ చేసిన ఈ పనికి యావత్ మానవాళి జేజేలు కొడుతుంది.
ఆటలో ధీరుడు.. గుణంలో కర్ణుడు
మరోవైపు ఆటలో ధీరుడు.. గుణంలో కర్ణుడు అంటూ ఆకాశానికెత్తుతుంది. రియల్ హీరో అని కొనియాడుతున్నారు. వాస్తవానికి రిషబ్ పంత్ కి ఇలాంటి సహాయాలు కొత్తేమి కాదు.. గతంలో చాలా సందర్భాల్లో పేదలకు ఆర్థిక సాయం చేశాడు. రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా తనకు వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు పంచి పెడుతున్నాడు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో అవసరమైన వారికి తగు సాయం చేస్తుంటాడు పంత్. ఇక రిషబ్ పంత్ చేసిన సాయానికి అతనికి కృతజ్ఞతలు చెప్పింది జ్యోతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “నేను గలగలిలో నా II PUC పూర్తి చేశాను. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సును అభ్యసించాలని కలలు కన్నాను. కానీ మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నేను అనిల్ హనాషికట్టి అన్నని సంప్రదించాను. అతను బెంగళూరులోని తన స్నేహితులను సంప్రదించాడు. వారు నా పరిస్థితిని రిషబ్ పంత్ దృష్టికీ తీసుకువచ్చారు.
అప్పుడు అతను నాకు సాయం చేశాడు. రిషబ్ పంత్ కు దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించుగాక. ఆయన సహాయం నాకు చాలా ముఖ్యం. నాలాంటి పేద కుటుంబాల నుంచి వచ్చిన ఇతర విద్యార్థులకు ఆయన మద్దతూ ఇస్తూనే ఉంటారని నేను ఆశిస్తున్నాను” అని విద్యార్థిని జ్యోతి తెలిపింది. ఇక రిషబ్ పంత్ కాలుకి గాయం కారణంగా 5వ టెస్ట్ మ్యాచ్ ఆడలేకపోయాడు. నాలుగు టెస్టులు ఆడిన పంత్.. 68 యావరేజ్ తో 479 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.