Kishan Reddy : మూసీ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు వాటిని అడ్డుకునే ప్రయత్నాలను విమరించుకోవడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మూసీని పూర్తిగా శుద్ధి చేయాలని సంకల్పించి, తక్షణ చర్యలకు అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. నగరం నడిబొడ్డున ప్రవహిస్తున్న ఈ నది, దిగువన కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఈ కారణంగానే.. మూసీని శుద్ధి చేసి వారి జీవితాలు బాగు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా అధికార నాయకులు చెబుతున్నారు.
నిత్యం ఏదో ఓ వ్యతిరేక వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని నాయకులు ఆగ్రహిస్తున్ వేళ.. మూసీ ప్రక్షాళనకు తాము మద్దతిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని చెప్పిన కేంద్ర మంత్రి… ఈ విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదంటూ మెలిక పెట్టారు. అసలెందుకు ప్రభుత్వం మూసీని శుద్ధిచేయాలని అనుకుంటుంది, దాని ప్రధాన ఉద్దేశ్యం ఏంటనే విషయాల్లో స్పష్టత లేదని అన్నారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఇదే నాయకులు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజల ఇళ్లను కూలగొడ్డటం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు జంకుతున్నాయని, రియల్ ఎస్టేట్ రంగం భయాందోళనల్లో ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు.. ఇదే నాయకులు రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నారంటూ.. ఆరోపించడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
మూసీ ప్రక్షాళన విషయంలో తాము మద్ధతిస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మూసీ నదిలో చేపట్టాల్సిన పనులపై కొన్ని సలహాలు, సూచనలు చేశారు. నగరానికి ప్రధానమైన నీటి వనరుగా ఉన్న సమయంలో నిజాం రాజులు.. మూసీ కాల్వ వెంట రిటైనింగ్ వాల్ కట్టారని, ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించాలని సూచించారు. మూసీ నదిని శుభ్రమైన నీటితో ప్రవహించేలా చేస్తామంటున్న ప్రభుత్వం.. కేవలం సుందరీకరణ కోసమే మూసీ ప్రక్షాళన అంటే తాము అంగీకరించమని ప్రకటించారు.
మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అన్ని డబ్బుల్ని ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆస్తుల కంటే అప్పులు ఎక్కువున్నాయని చెబుతున్న ప్రభుత్వం.. ఇంత భారీ మొత్తంలో నిధుల్ని ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుంది అని అడిగారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మూసీ వెంట పాదయాత్ర కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. తమ సంకల్పానికి అడ్డు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకులు ఓట్ల కోసం తమపై నుంచి బుల్‌డోజర్లు పంపాలంటూ సవాళు విసిరారు. వాటిపై రేవంత్ కౌంటర్ వేశారు. దాంతో.. సీఎం హోదాలో ఉండి.. బుల్ డోజర్లతో తొక్కిస్తా అంటూ మాట్లాడితే.. ఎవరూ సహించరూ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాం.. ప్రజా విజయోత్సవాలు సిద్ధం కండి..
ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా వెళ్లిన రేవంత్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణాలో తాము అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలను అక్కడ వివరించిన రేవంత్ రెడ్డి.. ఎలాంటి అనుమానాలున్నా, తాము వాటికి సమాధానమిస్తామని ప్రకటించారు. దాంతో పాటే.. రైతులు రుణ మాఫీ సహా, వివిధ అంశాలపై అక్కడ ప్రసంగాల్లో వివరించారు. వాటిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు ప్రచారం చేసారని అన్నారు.