Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేసిన ఆయన, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ అభ్యర్థికి.. ప్రజా మద్దతు వెల్లువలా వస్తోందని పొన్నం పేర్కొన్నారు. బీజేపీ నేతలు బయట కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ, లోపల మాత్రం బీఆర్ఎస్‌తో కుమ్మక్కై పనిచేస్తున్నారు. పార్లమెంట్‌లో కిషన్ రెడ్డి కేసీఆర్‌కు మద్దతు ఇచ్చినందుకే ఇప్పుడు గురుదక్షిణగా బీఆర్ఎస్ వాళ్లు బీజేపీ అభ్యర్థిని బలపరుస్తున్నారు అని ఆయన అన్నారు.
పొన్నం ప్రభాకర్ తన వాదనకు గణాంకాలను ఆధారంగా చూపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో: బీఆర్ఎస్‌కి 68,979 ఓట్లు, కాంగ్రెస్‌కి 52,975, బీజేపీకి కేవలం 8,517 ఓట్లు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు 80,549కి పెరిగితే, కాంగ్రెస్ 64,212 ఓట్లు సాధించింది. బీజేపీ 25,866 ఓట్లు మాత్రమే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 89,705 ఓట్లు రావగా, బీజేపీకి 64,673 ఓట్లు, బీఆర్ఎస్‌కి కేవలం 18,405 ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో 25 వేల ఓట్లు తెచ్చుకున్న బీజేపీ, ఒక్కసారిగా పార్లమెంట్‌లో 64 వేల ఓట్లు ఎలా సాధించింది? అదే సమయంలో బీఆర్ఎస్ 80 వేల ఓట్ల నుంచి 18 వేలకే ఎందుకు పడిపోయింది? ఇది లోపాయికారి ఒప్పందం కాకపోతే ఏమిటి? అని మంత్రి ప్రశ్నించారు.
కేటీఆర్ ఒకవైపు తానా అంటే, కిషన్ రెడ్డి తందాన అని అంటున్నారని పొన్నం ఎద్దేవా చేశారు. ఇద్దరి మధ్య దాగి ఉన్న స్నేహం ప్రజలకు బహిర్గతమైంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి బదిలీ చేయడం గోప్యంగా జరుగుతోంది అని ఆయన ఆరోపించారు.
ఉపఎన్నికల్లో బీజేపీకి కేవలం 10 వేల ఓట్లు మాత్రమే వస్తాయని పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 25 వేల ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు డిపాజిట్ కాపాడుకోలేని పరిస్థితి. కిషన్ రెడ్డి గారికి చాలెంజ్ 6 శాతం ఓట్లు తెచ్చుకుంటే డిపాజిట్ వస్తుంది. మీరు సాధిస్తే చూపండి అని ఆయన సవాలు విసిరారు.
బీఆర్ఎస్‌తో ఒప్పందం చేసుకున్న బీజేపీ నాయకత్వం తమ కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను నిరాశ పరుస్తోంది. పార్టీని నమ్మి కష్టపడే వారిని రాజకీయంగా సమాధి చేస్తున్నారు. ఇది బీజేపీ బలహీనతకు నిదర్శనం అని మంత్రి మండిపడ్డారు.
ఎప్పటినుంచో ఎమ్మెల్సీ కవిత చెబుతున్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర 2019 నుంచే నడుస్తోంది. అదే అజెండా కింద ఇప్పుడూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గేమ్ ప్లాన్ కొనసాగుతోంది అని పొన్నం అన్నారు.
బీఆర్ఎస్ మాదిరి కక్షసాధింపు ధోరణి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. మేము ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కంటోన్మెంట్ ఉపఎన్నికల మాదిరిగా ఈసారి కూడా ప్రజలు కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తారు అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
Also Read: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. ఒక్క నెలలో 55 మంది అరెస్ట్
మీరు బీఆర్ఎస్‌తో కుమ్మక్కు అయ్యారని కార్యకర్తలు అడుగుతున్నారు. 2019లో కేసీఆర్ మద్దతుతో గెలిచిన కిషన్ రెడ్డి ఇప్పుడూ అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. బీజేపీ నిజమైన జవాబు ఇవ్వాలి అని మంత్రి హితవు పలికారు.