BRS Leaders: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల హడావిడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బీఆర్ఎస్ నేతల ఇళ్లపై సోదాలు జరపడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత తక్కెలపల్లి రవీంద్రరావు నివాసాల్లో అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉంచినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక ప్రభావం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర బలగాలతో కలిసి కమిషన్ పలు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామునే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు బీఆర్ఎస్ నేతల ఇళ్లకు చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. అధికారులు విలువైన వస్తువులు, నగదు సంబంధిత వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ తనిఖీలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేయడం ఏ నియమంలోనూ లేదు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య అని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మాకు సమాచారం ఇచ్చి, మా సమక్షంలో సోదాలు జరపాల్సింది. మేము లేని సమయంలో మా ఇళ్లను కంట్రోల్‌లోకి తీసుకోవడం పూర్తిగా అన్యాయం అని మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మరోవైపు తక్కెలపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుండాయిజం సాగిస్తుంటే పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదు. కానీ బీఆర్ఎస్ నేతల ఇళ్లపై అక్రమంగా సోదాలు చేస్తున్నారు. పోలీసులు కూడా రాజకీయంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. పోలీసులే పైసలు పంచుతున్నారని మాకు ఆధారాలు ఉన్నాయి అని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఇక పోలీసులు మాత్రం తమ చర్యలు చట్టపరమని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్దేశిత పద్ధతిలో తనిఖీలు చేస్తోంది. ఎటువంటి పార్టీ పట్ల పక్షపాతం లేదు. ఎవరైనా పెద్ద మొత్తంలో నగదు నిల్వ ఉంచినా, ఎన్నికల ప్రభావం చూపే ప్రయత్నం చేసినా చర్యలు తప్పవు అని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తమ శక్తి మేర ప్రచారం చేస్తున్నారు. ఈ సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ విషయంపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: ఇంకా రెండు రోజులే టైం.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై టెన్షన్ టెన్షన్..
సోదాలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారిని వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.