CM Revanth Reddy: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కబ్జాల నుంచి రక్షించి సుందరంగా తీర్చిదిద్దిన అంబర్‌పేట బతుకమ్మకుంటను బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గత కొన్ని దశాబ్దాలుగా కబ్జా కోరల్లో చిక్కుకుని డంపింగ్ యార్డుగా మారిన ఆ ప్రాంతం కేవలం వంద రోజుల్లో అత్యంత సుందరమైన కోనేరుగా రూపుదిద్దుకోవడం పట్ల సర్వత్రా ఆనందం వ్యక్తం అవుతుంది.
బతుకమ్మ పండుగ శుభవేళ.. అత్యంత వైభవంగా రూపుదిద్దుకున్న బతుకమ్మకుంట నీటిలో సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మను వదిలి గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి పూజలు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్నటి వరకు కబ్జాకోరల్లో చిక్కి, కుంచించుకుపోయిన అంబర్ పేట బతుకమ్మ కుంట నేడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. జలకళతో జీవకళను అలుముకుంది. తన అలలపై ఆడబిడ్డల బతుకమ్మల ఒయలు ప్రదర్శిస్తూ గత వైభవాన్ని తిరిగి సాధించుకుంది. హైదరాబాద్ మహానగరంలో కబ్జా కోరల్లో చిక్కి అస్థిత్వం కోల్పోయే ప్రమాదంలో ఉన్న ప్రతి చెరువును తిరిగి పునరుద్ధరిస్తాం. లేక్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దుతాం. దానికి ఈ రోజు ప్రారంభించుకున్న బతుకమ్మకుంట తొలి అడుగు’ అని అన్నారు.
వాతావరణంలో వస్తున్న విపరీత మార్పులు, హైదరాబాద్ పరిరక్షణలో భాగంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవం కోసం నగర వాసులు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
‘వాతావరణంలో వస్తున్న మార్పులు, రాబోయే ప్రమాదాలపై నిపుణులతో ఆలోచనలు చేసి హైడ్రాను ప్రారంభించాం. హైడ్రాను ప్రారంభించినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంత మందికి అర్థం కాలేదు. మరికొందరు తమ కబ్జాలు ఇక సాగవని రకరకాల ఎత్తుగడలు వేశారు. నదులు, నాలాలు, చెరువులను చెరబడితే తాట తీయాలని నిర్ణయం తీసుకున్నాం. మూసీ నదిని పునరుద్దరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది’- సీఎం రేవంత్ రెడ్డి
స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముందుకొచ్చి సహకరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల్లో రాజకీయాలు అవసరం లేదన్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన మిగతా నియోజకవర్గ శాసనసభ్యులు కూడా అభివృద్ధిలో కలిసి రావాలని కోరారు. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో 5 కి.మీ మేరకు విస్తరించిన మూసీ పరివాహక ప్రాంతంలో నిరుపేదల ఇళ్ల విషయంలో మంత్రి, కలెక్టర్ ఎన్యుమరేషన్ చేస్తే వారికి అవసరమైన పునరావాసం కల్పిస్తామన్నారు.
బతుకమ్మకుంటను కాపాడాలని ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్న సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు పేరును బతుకమ్మకుంటకు పెట్టడానికి అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కలిపి ఒకచోట మినీ సెక్రటేరియట్ ను నిర్మిస్తామన్నారు. వచ్చే డిసెంబర్ 9 తేదీలోపు అందుకు అన్ని అనుమతులు ఇవ్వడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేస్తామన్నారు.
“బతుకు తెరువు కోసం నగరానికి వలసవచ్చిన నిరుపేదలు మూసీ ఒడ్డున గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. నిరుపేదలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేయదు. చేయబోం. అందరినీ ఆదుకుంటాం. ఎవరెవరు నివాసం కోల్పోతున్నారో వారందరికీ ప్రభుత్వం శాశ్వత నివాసం ఏర్పాటు చేస్తుంది. మంచి పని చేయాలని, మంచి సంకల్పంతో ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు తప్పవు. కోవిడ్ తర్వాత పర్యావరణంలో ఊహించని రీతిలో మార్పులొచ్చాయి. హైదరాబాద్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు రోజుకు 2 సెం.మీ వర్షం కురిస్తే తట్టుకునే విధంగా నిర్మాణమయ్యాయి”- సీఎం రేవంత్ రెడ్డి
ఆ మేరకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నామని సీఎం తెలిపారు. కానీ పర్యావరణంలో వస్తున్న మార్పులు, విపరీతంగా పెరిగిన కాలుష్యం కారణంగా గంట రెండు గంటల్లోనే 40 సెం.మీ వర్షం వచ్చే ప్రమాదకరమై పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితులపై ముందుగానే ఆలోచన చేశామని, శాస్త్రవేత్తలతో మాట్లాడామన్నారు.