Big Stories

Rahul Gandhi: ఎంపీ ఫైజల్‌పై అనర్హత వేటు రద్దు.. మరి, రాహుల్‌గాంధీపై..?

rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఆ వెంటనే ఎంపీగా ఆయనపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. అయ్యో.. అంత తొందరెందుకు? అంటూ విపక్షం మండిపడింది. సూరత్ కోర్టు తీర్పుపై అప్పీల్‌కు 30 రోజులు గడువు ఉండగా.. ఈలోగా రాహుల్‌ను పదవిని ఫసక్ అనిపించడం.. ఢిల్లీలోని ఇంటినీ ఖాళీ చేయాలంటూ హుకూం జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటి మీదకొచ్చి కేంద్రంపై పోరాడుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

- Advertisement -

కట్ చేస్తే.. సేమ్ ఇలాంటి కేసులోనే ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై గతంలో వేసిన అనర్హత వేటును రద్దు చేస్తూ లోక్‌సభ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఫైజల్ అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే రోజే.. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్దరించడం విశేషం. ఎంపీ ఫైజల్ లానే.. రాహుల్‌గాంధీ విషయంలోనూ కేంద్రం వెనకడుగు వేయాల్సిందేనా? రూల్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకొని.. బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతోందా?

- Advertisement -

ఎన్సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్.. లక్షద్వీప్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. 2009లో కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సలీహ్‌పై దాడి చేశారన్న కేసులో 2023 జనవరి 10న ఫైజల్‌కు పదేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. తీర్పు వచ్చిన 3 రోజులకు, జనవరి 13న లోక్‌సభ సచివాలయం ఫైజల్‌ ఎంపీగా అనర్హుడని ప్రకటించింది. అయితే, తనను దోషిగా తేల్చడాన్ని వ్యతిరేకిస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు ఫైజల్. జనవరి 25న ఫైజల్ జైలు శిక్షపై స్టే విధించింది కేరళ హైకోర్టు.

కోర్టు స్టే తో ఫైజల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్దరించాల్సి ఉంది. కానీ, రెండు నెలలు గడుస్తున్నా లోక్‌సభ సచివాలయం స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారాయన. అక్కడ సరిగ్గా కేసు విచారణకు వచ్చే సమయంలోనే.. ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. తనను అనవసరంగా రెండు నెలల పాటు పార్లమెంట్‌కు దూరం చేశారంటూ ఎంపీ మహ్మద్ ఫైజల్ మండిపడుతున్నారు.

ఎంపీగా రాహుల్‌గాంధీపై వేటు వేయడంపై రాజకీయ రచ్చ జరుగుతున్న సందర్భంలోనే.. ఫైజల్ ఉదంతంలో కీలక పరిణామం జరగడం సంచలనంగా మారింది. ఒకవేళ రాహుల్ తన జైలు శిక్షపై స్టే తెచ్చుకున్నా.. ఫైజల్ మాదిరే లోక్‌సభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయకుండా వేధిస్తారా? అలా జరిగితే రాహుల్ కూడా సుప్రీంకోర్టుకు వెళతారని భావించి వెంటనే వెనక్కి తగ్గి సభ్యత్వాన్ని పునరుద్దరిస్తారా? అనేది రాజకీయంగా కీలకాశం కానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News