Pomegranates: దానిమ్మ పండు రుచిలో అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్య ప్రయోజనాలలో అగ్రగామి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ గుండె ఆరోగ్యానికి, రక్తప్రసరణకు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి. అయితే.. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యల ఉన్నవారు దానిమ్మను తినడం లేదా దాని జ్యూస్ తాగడం విషయంలో జాగ్రత్త వహించాలి. లేదా పూర్తిగా మానుకోవాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
1. తక్కువ రక్తపోటు ఉన్నవారు:
దానిమ్మ పండులో సహజంగానే రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. కానీ.. ఇప్పటికే తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు లేదా రక్తపోటును తగ్గించడానికి మందులు వాడుతున్నవారు దానిమ్మను ఎక్కువగా తీసుకుంటే.. రక్తపోటు మరింతగా తగ్గిపోయి తలనొప్పి, కళ్లు తిరగడం, లేదా స్పృహ తప్పడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. అలాంటివారు దానిమ్మకు దూరంగా ఉండటం మంచిది.
2. కొన్ని రకాల మందులు వాడుతున్న వారు:
దానిమ్మ పండు కొన్ని రకాల మందులతో పరస్పర చర్య జరిపి, ఆ మందుల ప్రభావంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా.. కింది సమస్యలకు మందులు తీసుకుంటున్నవారు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
రక్తం పల్చబరిచే మందులు : ముఖ్యంగా ‘వార్ఫారిన‘ వంటి మందులు తీసుకుంటున్నప్పుడు దానిమ్మ రసం తాగితే.. రక్తం గడ్డకట్టే విధానంపై ప్రభావం పడి మందు పనితీరు మారుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గించే మందులు: ఈ మందులను జీవక్రియ చేయడానికి కాలేయం ఉపయోగించే ఎంజైమ్‌లపై దానిమ్మ ప్రభావం చూపే అవకాశం ఉంటుందిు. మందుల స్థాయి పెరిగి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
రక్తపోటు మందులు: దానిమ్మ రక్తపోటును కూడా తగ్గిస్తుంది కాబట్టి, ఈ మందులతో కలిపి తీసుకుంటే రక్తపోటు అతిగా తగ్గే ప్రమాదం ఉంది.
3. జీర్ణ సమస్యలు,IBS ఉన్నవారు:
దానిమ్మలో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణంగా జీర్ణక్రియకు మంచిది. కానీ.. కొంతమందికి.. ముఖ్యంగా సున్నితమైన కడుపు లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్వంటి జీర్ణకోశ సమస్యలు ఉన్నవారికి.. దానిమ్మలోని అధిక ఫైబర్ , టానిన్లు ప్రేగులలో చికాకు కలిగించి కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి లేదా డయేరియా (విరేచనాలు) వంటి సమస్యలకు దారితీయవచ్చు. దానిమ్మ గింజలను సరిగా నమలకపోతే.. అవి జీర్ణం కావడం మరింత కష్టమవుతుంది.
4. దానిమ్మ అలర్జీ ఉన్నవారు:
చాలా అరుదుగా ఉన్నప్పటికీ.. కొంతమందికి దానిమ్మ పండు లేదా దాని ఉత్పత్తుల పట్ల అలెర్జీ ఉంటుంది. ఈ అలర్జీ ఉన్నవారు దానిమ్మను తింటే. దురద, దద్దుర్లు, ముఖం లేదా గొంతు వాపు, ముక్కు కారడం, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఇది ప్రాణాంతకమైన అనాఫిలాక్సిస్ కు కూడా దారితీయవచ్చు. గతంలో ఏదైనా పండు లేదా మొక్కల పట్ల అలెర్జీ ఉన్నవారు దీనిని తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
Also Read: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !
5. శస్త్రచికిత్స చేయించుకోబోయే వ్యక్తులు:
దానిమ్మ రక్తపోటు, రక్తం గడ్డకట్టే సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. శస్త్రచికిత్సకు ముందు, తరువాత, రక్తపోటు, రక్తస్రావాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకే.. చాలా మంది డాక్టర్లు.. రోగులు శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు దానిమ్మ పండును తినడం లేదా జ్యూస్ తాగడం మానుకోవాలని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది ఆపరేషన్ సమయంలో, తరువాత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
దానిమ్మ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ.. పై సమస్యలు ఉన్నవారు దీనిని తినే ముందు తప్పకుండా తమ డాక్టర్‌ని సంప్రదించి వారి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన వ్యక్తులు దానిమ్మను మితంగా తీసుకోవచ్చు. కానీ ఏదైనా కొత్త లక్షణం కనిపిస్తే వెంటనే దానిని ఆపడం మంచిది.