Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు.. పెద్ద ఎత్తున ఉగ్రవాదులపై సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం. ఆపరేషన్ పింపుల్ అనే పేరుతో కొనసాగుతున్న ఈ దాడి కుప్వారా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కొనసాగుతోంది.
భద్రతా దళాలకు గురువారం రాత్రి ఉగ్రవాదుల కదలికలపై గూఢచార సమాచారం అందింది. దాంతో రాష్ట్ర రైఫిల్స్, జమ్మూ కశ్మీర్ పోలీసు, సీఆర్పీఎఫ్ బలగాలు కలిసి కంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. మాచిల్ సెక్టార్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం.
సైనిక దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అనంతరం భద్రతా బలగాలు ప్రతీకారంగా కాల్పులు జరిపాయి. సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా కొంతమంది ఉగ్రవాదులు దాక్కున్నారనే అనుమానంతో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఆపరేషన్ పింపుల్ కుప్వారా, బారాముల్లా సెక్టార్‌లలో ఇటీవల పెరిగిన ఇన్‌ఫిల్ట్రేషన్ ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా మొదలుపెట్టింది. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల నుంచి రహస్యంగా చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం తెలిపింది.
ఎదురుకాల్పులు ముగిసిన వెంటనే అదనపు దళాలను ప్రాంతానికి తరలించారు. మొత్తం అడవీ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. డ్రోన్ల సాయంతో పర్యవేక్షణ, హెలికాప్టర్‌ల ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గత కొంతకాలంగా కుప్వారాలో ఇన్‌ఫిల్ట్రేషన్ ప్రయత్నాలు గణనీయంగా పెరిగాయి. నవంబర్ నాటికి హిమపాతం మొదలవుతుందని, అందుకే ఉగ్రవాదులు చొరబడే ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారని సమాచారం. ఈ ఉగ్రవాదులు లష్కరే తోయిబా కు చెందినవారని అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ
ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. భద్రతా బలగాలు కుప్వారా అడవుల్లో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.