ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారా? ఒకసారి రవ్వ పులిహోర ప్రయత్నించి చూడండి. సాధారణ పులిహోర అందరూ తినే ఉంటారు. టేస్టీగా కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చే అవకాశం ఉంది. అన్నట్టు ఇది చేయడానికి పెద్ద ఎక్కువ సమయం కూడా పట్టదు. పొడిపొడిగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేయండి.
రవ్వ పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యపు రవ్వ – రెండు కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – రెండు స్పూన్లు
పసుపు – చిటికెడు
చింతపండు – ఉసిరికాయ సైజులో
పచ్చిమిర్చి – ఆరు
కరివేపాకులు – గుప్పెడు
ఎండుమిర్చి – ఐదు
వేరుశనగలు – అరకప్పు
ఇంగువ – చిటికెడు
ఆవాలు – ఒక స్పూను
మినప్పప్పు – రెండు స్పూన్లు
పచ్చిశనగపప్పు – రెండు స్పూన్లు
రవ్వ పులిహోర రెసిపీ
1. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోయాలి. నీళ్లు సలసలా మరుగుతున్నప్పుడు బియ్యపు రవ్వను వేసి ఉడికించాలి.
2. అన్నం ఎలా పొడిపొడిగా వస్తుందో అలా రవ్వ కూడా పొడిపొడిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
3. ఉడికిన రవ్వను ఒక ప్లేట్లో వేసి పొడిపొడిగా ఆరబెట్టుకోవాలి. పైన రెండు స్పూన్ల నూనె వేసి మూత పెట్టాలి కలిపేసి మూత పెట్టాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఒక స్పూను రెండు స్పూన్ల నూనె వేయాలి.
5. అందులో ఆవాలు, వేరుశెనగ పలుకులు, పచ్చి శెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి.
6. అవి వేగాక కరివేపాకులు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, పసుపు, ఇంగువ వేసి వేయించుకోవాలి.
7. చింతపండును ముందుగానే నానబెట్టి పిండి నీటిని పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు కళాయిలోని మిశ్రమంలో తగినంత ఉప్పు, చింతపండు రసం వేసి దగ్గరగా ఉడికించుకోవాలి.
9. ఇది దగ్గరగా వచ్చాక ముందుగా చల్లార్చిన రవ్వను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పైన నిమ్మకాయను పిండుకోవాలి. అంతే టేస్టీ రవ్వ పులిహోర రెడీ అయిపోతుంది.
10. రవ్వను పొడిపొడిగా వచ్చేలా చేసుకోవడమే ఇందులో కొంచెం కష్టమైన టాస్క్.
11. ఎక్కువ నీరు పోసేస్తే ముద్ద అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రవ్వను పొడిపొడిగా ఉండేలా వండుకోవాలి.
చాలా తక్కువ సమయంలోనే రవ్వ పులిహోరను చేసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్ లోనే కాదు లంచ్, డిన్నర్లలో కూడా తినవచ్చు. ఎందుకంటే మనం దీన్ని బియ్యం రవ్వతోనే చేసాము. బియ్యంతో అన్నం వండుకొని తిన్నట్టే ఈ రవ్వతో పులిహోర చేసుకొని తినవచ్చు. పిల్లలకు ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పుకోవాలి. దీంతోపాటు టమోటా పికిల్ పక్కన పెట్టుకుంటే రుచి అదిరిపోతుంది. కొంచెం పెద్దవాళ్లు కొంచెం స్పైసీగా చేసుకుంటే తినాలనిపిస్తుంది. అదే పిల్లలకు అయితే పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.