Flying Squad Raids: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా.. నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటుకు నగదు పంపిణీ ఆరోపణల నేపథ్యంలో.. ప్రధాన పార్టీల నాయకుల ఇళ్లపై దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.
తాజాగా హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం, ఎర్రగడ్డ డివిజన్‌లో శనివారం రాత్రి జరిగిన ఆకస్మిక సోదాలు రాజకీయ వర్గాలను కుదిపేశాయి. ప్రేమ్‌నగర్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు సాలం షౌజ్ నివాసంలో.. భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
శనివారం అర్ధరాత్రి సమయానికి మేజిస్ట్రేట్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. నగదు నిల్వ ఉందనే సమాచారం అందుకున్న అనంతరం, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి.
ఇటీవల ఉప ఎన్నికల ప్రచారం నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో నగదు తరలింపులు జరుగుతున్నాయన్న సమాచారం ఆధారంగా.. అధికారులు చర్యలు ప్రారంభించారు.
సమాచారం తెలుసుకున్న బీఆర్‌ఎస్ లీడర్స్, కార్యకర్తలు సాలం షౌజ్ ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు చేపట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తిత నెలకొంది. నగదు తనిఖీలను మీడియా సమక్షంలో నిర్వహించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే, విస్తృత తనిఖీల తర్వాత సాలం షౌజ్ ఇంట్లో ఎలాంటి నగదు లభించకపోవడం గమనార్హం. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వెనుదిరిగారు. పోలీసులు బీఆర్‌ఎస్ నేతలను, కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు.
Also Read: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలకమైన నిందితుడు అరెస్టు
మరోవైపు ఎర్రగడ్డలోని బీఆర్ఎస్ నాయకుడు జానీమియా ఇంట్లో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు.. సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేపట్టారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు అక్కడి చేరుకుని నిరసన చేపట్టారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీకీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు.