Big Stories

Telangana : నాడు చంద్రబాబు.. నేడు కేసీఆర్ ..సీబీఐకి నో ఎంట్రీ

Telangana : తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరుపార్టీల నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో సీబీఐ ఎంట్రీకి నో చెప్పారు. రెండు నెలల క్రితమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 30న జీవో నెంబర్ 51ను జారీ చేసిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

లిక్కర్ స్కామ్ వర్సెస్ ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసు
తొలుత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావిస్తూ బీజేపీ టార్గెట్ చేసింది. ఆమె సన్నిహితుల ఇళ్లపైనా ఈడీ, సీబీఐ దాడులు చేశాయి. కానీ కవితను మాత్రం ప్రశ్నించలేదు. ఈ లోపే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా నడిచిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం రేపింది. బీజేపీనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు దూతలను పంపిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అటు హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని నెలల క్రితం బీహార్ లో పర్యటించి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో బీహార్ లో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ సమర్ధించారు. మిగిలిన ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే నిర్ణయం అమలు చేశారు.

- Advertisement -

నాడు చంద్రబాబు..
2019 ఎన్నికలకు ముందు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతి నిరాకరించారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన వెంటనే మోదీ ప్రభుత్వంపై చంద్రబాబు యుద్ధం ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ఆందోళన చేపట్టారు. అదే సమయంలో బీజేపీ నేతలు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అప్పటి ఏపీ ప్రభుత్వం. అప్పట్లో ఆ నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సీబీఐకు దారేది?
ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1946 సెక్షన్‌ ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో సీబీఐ ద‌ర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం. ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, బీహార్, మేఘాల‌య‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌తోసహా తొమ్మిది రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతి నిరాకరించాయి. కేంద్రం విచారణ సంస్థల పేరుతో రాజకీయ వేధింపులకు దిగుతోందనే ఆరోపణలతో కొన్ని రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో కేసీఆర్ సర్కార్ ప్రయాణిస్తోంది. రాష్ట్రంలో ఏదైనా కేసును విచారణ చేయాల్సి ఉంటే, స్థానిక ప్రభుత్వాలు అనుమతించపోతే సీబీఐ న్యాయస్థానం ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పే అవకాశం ఉండదు. ఇప్పుడు తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News